కమల్ తూచ్ అనేశాడు

Update: 2018-11-25 06:27 GMT
లోక నాయకుడు కమల్ హాసన్ ఈ ఏడాది చేసిన విశ్వరూపం 2 అంచనాలకు భిన్నంగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన స్పందనలో కనీసం సగం కూడా దక్కించుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. ఒకపక్క రాజకీయ వ్యవహారాలతో పాటు బిగ్ బాస్ 2 యాంకరింగ్ ని కూడా సమర్ధవంతంగా నిర్వహించిన కమల్ డిసెంబర్ రెండో వారం నుంచి మొదలుకాబోయే భారతీయుడు 2 కోసం రెడీ అవుతున్నాడు. శంకర్ ఇప్పటికే 2.0 ప్రమోషన్ ని పక్కన పెట్టి మరీ దీని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడని చెన్నై టాక్.

ఇక దీంతో పాటు పాతికేళ్ళ క్రితం వచ్చిన క్షత్రియ పుత్రుడు కూడా సీక్వెల్ చేస్తానని కమల్ ఇంతకు ముందు స్వయంగా ప్రకటించాడు. మీడియాలో అది బాగా హై లైట్ అయ్యింది. ఆ చిత్ర దర్శకుడు భరతన్ కాలం చేసినప్పటికీ వేరొకరితో తీయించే ఆలోచనలో ఉన్నట్టు కమల్ గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన  విరమించుకున్నట్టు చెబుతున్నాడు. తేవర్ మగన్ అనే పేరుతో ఏదైనా సినిమా చేసినా దానికి కొనసాగింపుగా ఉండే అవకాశం లేదని అప్పుడు ముగించిన కథ దానికి ఆస్కారం కూడా ఇవ్వదని క్లారిటీ ఇచ్చేసాడు. ఒకవేళ చేసినా ఆ క్లాసిక్ తో పోల్చడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయని గుర్తించి పూర్తిగా మానుకున్నట్టు చెప్పాడు.

అయితే భారతీయుడు సినిమాతో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ ఉంటుందనేది ఖాయమని కమల్ మాట. కాని షూటింగ్ ఆగిపోయిన శభాష్ నాయుడు గురించి మాత్రం కమల్ ఏదీ చెప్పడం లేదు. శృతి హాసన్ కూతురిగా అందులో నిజ జీవిత పాత్ర చేసింది. దాని షూటింగ్ లో ఉన్నప్పుడే కమల్ కాలు బెణికి చాలా కాలం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. క్షత్రియ పుత్రుడు లేదు సరే మరి శభాష్ నాయుడు కూడా షెడ్డుకు వెళ్ళినట్టేనా. ఏమో కమల్ చెబితేనే స్పష్టత వస్తుంది
Tags:    

Similar News