చరణ్ ఆవిష్కరించిన కమల్ 'విక్రమ్' ట్రైలర్..!

Update: 2022-05-20 12:10 GMT
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''విక్రమ్'' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో కమల్ అండ్ టీమ్ అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇది వరకే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే ఇటీవల తమిళ్ హిందీ భాషల్లో వదిలిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ క్రమంలో తాజాగా ''విక్రమ్'' తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. యాక్షన్‌ తో నిండిపోయిన ఈ ట్రైలర్ అద్భుతంగా మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. విశ్వనటుడి అభిమానులు మరియు సినీ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

''అడవి అన్నాక.. సింహం పులి చిరుత అన్నీ వేటకు వెళ్లాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆరోజు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు అనేది నిర్ణయించేది ప్రకృతి కాదు.. నేను'' అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన విక్రమ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

కమల్ - సేతుపతి - ఫాహాద్ వంటి ముగ్గురు వర్సటైల్ నటులు ఒకరిపై ఒకరు పోరాడేలా.. మూడు వైపుల ఘర్షణను ఈ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ లో చూడొచ్చు. సూర్య పాత్రను ఇందులో రివీల్ చేయలేదు. ఇందులో కాళిదాస్ జయరామ్ - నరైన్ - అర్జున్ దాస్ - శివాని నారాయణన్ ఇతర పాత్రలు పోషించారు.

కమల్ హాసన్ - విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ త్రయం పెర్ఫార్మెన్స్‌ తో అదరగొట్టారు. ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించి.. ఒకే ఇంటెన్స్ ను కొనసాగించారు. లోకేష్ కనగరాజ్ తన పవర్ ఫుల్ పంచ్‌ లైన్‌లు మరియు అద్భుతమైన టేకింగ్‌ తో ప్రత్యేకంగా నిలుస్తాడు.

అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. గిరీష్ గంగాధర్ మాస్టార్ సినిమాటోగ్రఫీ.. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్.. సతీష్ కుమార్ ఆర్ట్.. ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు - అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ ప్రశంసించదగినవిగా ఉన్నాయి. మొత్తం మీద ఉత్కంఠను కలిగిస్తోన్న 'విక్రమ్' ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

''విక్రమ్'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 2022 జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ తన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

'విక్రమ్' చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యాక్టింగ్ పవర్ హౌసెస్ కమల్ హాసన్ - విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News