కమల్ పెద్ద షాకివ్వబోతున్నాడా?

Update: 2017-02-27 10:46 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ లను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు.. తమిళ సామాన్య జనాలు ఎప్పట్నుంచో అడుగుతున్నారు. కానీ వాళ్లు అందుకు ఏనాడూ సుముఖత వ్యక్తం చేయలేదు. మధ్యలో రజినీకాంత్ అయినా కొంచెం రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లుగా కనిపించారు కానీ.. కమల్ మాత్రం ఎన్నడూ రాజకీయాల్లో వచ్చేలా కనిపించలేదు. రోజులు గడిచేకొద్దీ వీరి రాజకీయ అరంగేట్రంపై అభిమానులకు పూర్తిగా ఆశలు పోయాయి. రజినీ ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండటం.. ఆయన పూర్తిగా సైలెంటైపోవడంతో ఇక ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి తరుణంలో కమల్ హాసన్ భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నాకు కోపం ఎక్కువ.. నేను రాజకీయాలకు పనికి రాను అని ఈ మధ్యే ప్రకటించిన కమల్.. మరోవైపు రాజకీయారంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడేమో అనిపిస్తోంది ఆయన తీరు చూస్తుంటే. గత కొన్ని నెలలుగా తమిళనాట నెలకొన్న రాజకీయ పరిణామాలపై కమల్ ప్రతి రోజూ స్పందిస్తున్నాడు. ప్రస్తుత నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జనాల్ని మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు. తన అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్నారు. వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అంటున్నారు. తన సినిమాల సంగతుల్ని కూడా పక్కనబెట్టేసి కమల్ కేవలం రాజకీయాంశల మీదే ప్రతి రోజూ మాట్లాడుతుండటం.. ఎన్నడూ లేని విధంగా అభిమానుల్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంకేతాల్నిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో శూన్యత ఉంది. ప్రజాకర్షణ ఉన్న సినీ నటుడు వస్తే ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో కమల్ తన రాజకీయారంగేట్రాన్ని ప్రకటించి షాకిస్తాడేమో అని తమిళ జనాలు భావిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News