వెబ్ సిరీస్ గా కమల్ కలల సినిమా?

Update: 2017-06-27 13:01 GMT
మరుదనాయగం.. లోకనాయకుడు కమల్ హాసన్ కలల సినిమా. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట బ్రిటిష్ రాణి ఎలిజబెత్ సమక్షంలో అట్టహాసంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టాడు కమల్. కానీ కొన్నాళ్లు షూటింగ్ జరుపుకున్నాక అనివార్య కారణాలతో ఆగిపోయిందా చిత్రం. ఐతే దాన్ని మళ్లీ మొదలుపెట్టాలని.. పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని తపిస్తున్నాడు కమల్. కానీ అతడి కోరిక నెరవేరట్లేదు.

ఈ సినిమాను బయటికి తీసుకొచ్చే నిర్మాణ సంస్థ కోసం కమల్ ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. తన కొత్త సినిమాల విడుదలకు ముందు మీడియాను కలిసినపుడల్లా ‘మరుదనాయగం’ గురించి మాట్లాడే కమల్.. ఎప్పటికైనా ఆ సినిమాను బయటికి తేవాలన్న సంకల్పంతోనే కనిపిస్తాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కమల్ మరోసారి ‘మరుదనాయగం’ గురించి మాట్లాడాడు.

ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని అడిగితే.. ‘‘థియేటర్లలోకే రావాలని ఏముంది? అది వెబ్ సిరీస్ లేదా టీవీ సిరీస్ రూపంలోకి మారొచ్చేమో. ఆ విధంగా అయినా ప్రేక్షకుల్ని పలకరించొచ్చేమో’’ అన్నాడు. ప్రపంచంలో అనేక దేశాల్లో టీవీ సిరీస్.. వెబ్ సిరీస్ ఇప్పటికే ఎంతో పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలోనూ వెబ్ సిరీస్ జోరు పెరుగుతోంది. మున్ముందు టీవీ సిరీస్ కూడా ఇక్కడ పాపులర్ అవుతాయని భావిస్తున్నారు. కమల్ బడ్జెట్ విషయంలో కొంచెం రాజీ పడి.. ‘మరుదనాయగం’ను పూర్తి చేసి వెబ్ సిరీస్ లేదా టీవీ సిరీస్ గా దాన్ని రిలీజ్ చేసిన ఆశ్చర్యం లేదేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News