ఆచార్యకు చందమామ కూడా హ్యాండ్‌ ఇవ్వనుందా?

Update: 2020-04-29 05:15 GMT
ఏ ముహూర్తాన అనుకున్నారో కాని మెగాస్టార్‌ చిరంజీవి 152వ ప్రాజెక్ట్‌ కు చిక్కు లేదా అడ్డంకి వస్తూనే ఉంది. సైరా చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. కాని ఏదో కారణం వల్ల దాదాపు ఏడాది కాలం పాటు దర్శకుడు కొరటాల శివ ఎదురు చూస్తూనే వచ్చాడు. సైరా చిత్రం విడుదలైన తర్వాత కూడా దాదాపుగా మూడు నాలుగు నెలల వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. వంద రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసి ఆగస్టు వరకు విడుదల చేస్తామన్నారు. షూటింగ్‌ మొదలు పెట్టిన వెంటనే హీరోయిన్‌ త్రిష తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి వెళ్లి పోయింది.

త్రిష స్థానంలో ఎవరిని తీసుకుందాం అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో పూర్తిగా షూటింగ్‌ ఆగిపోయింది. పలువురు హీరోయిన్స్‌ తో చర్చలు జరిపిన తర్వాత చివరకు కాజల్‌ తో చిరు రొమాన్స్‌ కు సిద్దం అయ్యాడు. కాజల్‌ కూడా తాను ఆచార్య చిత్రంలో నటిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో పాటు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఆచార్యలో కాజల్‌ నటించబోవడం లేదు అంటూ మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ముఖ్యంగా తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్‌ కు జోడీగా కాజల్‌ ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందట. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో ఎప్పుడంటే అప్పుడు డేట్లు ఇచ్చేలా కమిట్‌ అయ్యిందట. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే వరుగా రెండు నెలల పాటు ఆ సినిమాకే ఈమె డేట్లు ఇవ్వాల్సి వస్తుందట.

ఆ కారణంగా ఆచార్య చిత్రానికి డేట్లు అడ్జెస్ట్‌ చేయలేక పోతున్నట్లుగా చెప్పి తప్పుకుంటుందని కొందరు అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆచార్యలో హీరోయిన్‌ పాత్ర మరీ కూరలో కరివేపాకు మాదిరిగా ఉందని అందుకే త్రిష మాదిరిగా కాజల్‌ కూడా నటించేందుకు నో చెప్పిందని.. అందుకే ఏవో కారణాలు చెబుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది కాజల్‌ నోరు విప్పితే కాని తెలియదు.
Tags:    

Similar News