సూపర్ స్టార్ కోసం ఆ సినిమా ఫస్ట్ షో

Update: 2016-12-25 15:30 GMT
‘మొహెంజదారో’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘కాబిల్’ మీదే ఉన్నాయి. కాబిల్ టీజర్.. ట్రైలర్.. దాని పాటలు చూస్తుంటే హృతిక్ ఆశలు తీరేలాగే కనిపిస్తోంది. మంచి విషయం ఉన్న సినిమాలా అనిపిస్తోంది ‘కాబిల్’. జనవరి 25న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుఖ్ ఖాన్ మూవీ ‘రయాస్’తో పోటీ ఉన్నా.. తమ సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉంది ‘కాబిల్’ టీమ్. విశేషం ఏంటంటే.. ఈ సినిమా ఫస్ట్ ప్రివ్యూ షోను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు చూపించబోతున్నారట. ఇటీవల రజినీ ‘కాబిల్’ ట్రైలర్ చూసి చాలా బాగుందంటూ మెచ్చుకున్నట్లుగా వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో ‘కాబిల్’ నిర్మాత.. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మాట్లాడుతూ.. హృతిక్ తన తొలి సినిమా ‘భగవాన్ దాదా’లో రజనీకాంత్ తో కలిసి నటించాడు. అతడికదే తొలి కెమెరా అనుభూతి. హృతిక్ ను చూసిన రజనీ.. మీ అబ్బాయి తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడు అని ఆరోజే చెప్పారు. అలాంటి మంచి వ్యక్తి నాకు స్నేహితుడవడం నా అదృష్టం. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయనతో మాట్లాడి చాలా రోజులైంది. ఆయన మా సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా స్పందించడం సంతోషం. ఈ సినిమా మొదటి స్క్రీనింగ్ ఆయనకే వెయ్యాలని.. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని భావిస్తున్నాం’’ అని చెప్పాడు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన కాబిల్ లో హృతిక్ సరసన యామి గౌతమ్ నటించింది. ఇందులో వాళ్లిద్దరూ అంధులుగా నటించడం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News