జెర్సీ ట్రైలర్: భావోద్వేగానికి గురిచేసే స్పోర్ట్స్ డ్రామా..!

Update: 2022-04-04 09:31 GMT
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ''జెర్సీ''. ఇది తెలుగులో నాని నటించిన 'జెర్సీ' చిత్రానికి అధికారిక రీమేక్. మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని హిందీలో తెరకెక్కించారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'జెర్సీ' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఉద్యోగానికి దూరమై జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్న ఒక మాజీ క్రికెటర్.. తన కొడుకు కోసం 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టుకోవాల్సి వస్తుంది.

ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో వదిలేసిన తన లక్ష్యాన్ని ఈసారైనా నెరవేర్చుకున్నాడా? లేదా జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగానే మిగిలిపోతాడా? తన కొడుకు కోరుకున్న జెర్సీ అందించాడా లేదా? అనేది తెలియాలంటే 'జెర్సీ' సినిమా చూడాల్సిందే. క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇందులో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో సత్యరాజ్ చేసిన కోచ్ పాత్రలను హిందీలో షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ చేయడం విశేషం. ట్రైలర్ చూస్తుంటే ఎలాంటి మార్పులు చేయకుండా ఒరిజినల్ ను ఫాలో అయినట్లు తెలుస్తోంది.

తెలుగులో నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన 'జెర్సీ'.. జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా గెలుచుకుంది. ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రొఫెషనల్ క్రికెటర్ గా కనిపించాడానికి క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ నిర్మించిన ఈ సినిమాకు బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు.

సచేత్-పరంపర ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్.. ఈసారి 'జెర్సీ' రీమేక్ తో మరో విజయాన్ని అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కాకపోతే అదే సమయంలో 'కేజీఎఫ్: చాప్టర్ 2' - 'బీస్ట్' వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వాటిని తట్టుకుని 'జెర్సీ' సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View

Tags:    

Similar News