జయలలితను ఢీకొడుతున్న తెలుగు నిర్మాత

Update: 2016-04-30 11:08 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చూస్తే ఆమె ప్రధాన ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. ఐతే ఆమెను ఓ తెలుగు నిర్మాత ఢీకొట్టడానికి రెడీ అయ్యాడు. తమిళనాడు ఎన్నికల్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే తెలుగు నిర్మాత జయలలిత మీద పోటీకి దిగుతుండటం విశేషం. తమిళనాడులోని తెలుగు వారి కోసం ‘తెలుగు యువ శక్తి’ అనే సంస్థను పెట్టి దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి. ఆ సంస్థ కార్యకలాపాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన ఆయన.. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో పోటీకి సై అంటున్నాడు. ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పోటీకి నామినేషన్ కూడా వేశాడు.

ఆర్కే నగర్ నియోజకవర్గంలో తెలుగు వాళ్ల సంఖ్య బాగానే ఉండటంతో జగదీశ్వర్ రెడ్డికి ఓ మోస్తరుగా ఓట్లు పడే అవకాశాలున్నాయి. ఆయన ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. జగదీశ్వర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తెలుగువాళ్లు అధికంగా ఉండే హోసూర్లోనూ ఆయన బరిలోకి దిగుతున్నారు. తమిళనాట ఉండే తెలుగు వారి బాగోగుల్ని జయలలిత అస్సలు పట్టించుకోవడం లేదని.. పాఠశాలల్లో తమిళం తప్ప మరో భాష బోధించకుండా రూల్ తేవడం ద్వారా ఇక్కడి తెలుగు వారికి తీవ్ర అన్యాయం చేసిందని.. అందుకే ఎన్నికల్లో పోటీ పడి ఆమెను ఓడించాలన్న లక్ష్యంతో తాను బరిలోకి దిగుతున్నానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు.
Tags:    

Similar News