వారితో కలిసి నటించడం గొప్ప అనుభవం!

Update: 2019-05-10 10:22 GMT
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో విజయాలు సాధించినంతగా మరే భాషలోనూ సాధించలేదు.  తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తే అవి అంతంతమాత్రమే.  ఇక బాలీవుడ్ పై ఫోకస్ చేసి ఇప్పటివరకూ రెండు సినిమాలు 'యారియా' .. 'అయ్యారి' చేస్తే అవి కూడా రకుల్ కు విజయాన్ని అందించలేకపోయాయి.  ఇప్పుడు ముచ్చటగా మూడో సారి 'దే దే ప్యార్ దే' తో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో టబు మరో కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో 50 ఏళ్ళ వివాహితుడికి ప్రియురాలి పాత్రలో రకుల్ నటిస్తోంది. ఈ సినిమా మే 17 న రిలీజ్ కానుంది.  ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.  ఫిలిం ఇండస్ట్రీలో జయాపజయాలు సాధారణం అని చెప్పింది. యాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని.. మంచిపేరు సాధించాలని చాలామంది కలలు కంటారని.. అయితే కొద్దిమందికి మాత్రమే అలాంటి అదృష్టం దక్కుతుందని తెలిపింది. సినీ పరిశ్రమలో తనకు దక్కిన స్థానం చూసి గొప్పగా భావిస్తానని తెలిపింది.  

అయితే ఇదంతా భగవంతుని కృప అని నమ్ముతానని చెప్పింది.  అలా అని ఊరుకోనని.. చాలా కష్టపడతానని తెలిపింది. వర్క్ అంటే తనకు ఇష్టమని.. అందుకే 30 గంటల పాటు ఏకధాటిగా అలుపు లేకుండా పని చేయగలనని చెప్పింది.  సీనియర్ నటులతో పనిచేయడం కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది.  వారి అనుభవంతో మనం కొన్ని నేర్చుకోవచ్చని.. వారితో  పోటీ పడి నటించడం వల్ల మన నటన మెరుగవుతుందని తెలిపింది. 'దే దే ప్యార్ దే' లో అజయ్ దేవగణ్.. టబు లాంటి అద్భుత నటులతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం అని చెప్పింది.

రకుల్ నటించిన మొదటి రెండు సినిమాలు పరాజయం పాలైన నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయిందంటే ఫుల్లుగా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుందేమో!


Tags:    

Similar News