ఆర్జీవీని ప్రమోట్ చేస్తూ ఆ వెబ్ మీడియా బ్రతుకుతోందా...?

Update: 2020-08-17 08:50 GMT
తెలుగు ప్రేక్షకులు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మంచి సినిమా ఆశించి చాలా రోజులు అయింది. ఆర్జీవీని ఫిలిం మేకర్ గా కంటే కాంట్రవర్సీ పర్సన్ గా.. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేసే ట్వీటకుడిగా గుర్తుపెట్టుకునే వారు ఎక్కువ. అందుకే ఆయన సినిమాలు ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాయో.. ఎప్పుడు పోతాయో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఒకప్పుడు టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయే సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు వీలైనంత త్వరగా ఆ నాసిరకం సినిమాలు మర్చిపోవాలి అని అనుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఈ క్రమంలో టాలీవుడ్ టూ బాలీవుడ్.. బాలీవుడ్ టూ టాలీవుడ్ అంటూ ట్రావెల్ చేస్తున్న ఆర్జీవీ ప్రస్తుతం తన కంపెనీని టాలీవుడ్ లో పెట్టుకున్నాడు. ఆ కంపెనీ నుండి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తూ.. వర్మ ఏంటి మాకు ఈ ఖర్మ అనుకునేలా చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయిన ఆర్జీవీ.. ఇప్పటికీ వార్తల్లో ఉండటానికి ప్రధాన కారణం కొన్ని ప్రసార మాధ్యమాలు.. వెబ్ సైట్స్ ఆయన్ని హైలైట్ చేసి చూపించడమే అని కామెంట్స్ వినిపిస్తుంటాయి.

కాగా ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోని పలువురిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేయడం.. కామెంట్స్ చేయడం.. సినిమాలు తీయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో సెటైరికల్ మూవీస్.. సెమీ పార్న్.. లెస్బియన్ కథాంశాలతో సినిమాలు తీస్తున్నాడు. అయితే అవేమీ గొప్ప సినిమాలు కాదు. అయినప్పటికీ ఓ వెబ్ మీడియా మాత్రం వాటిని హైలెట్ చేస్తూ కాంట్రవర్సీ అయ్యేలా చేసి, ఆర్జీవీకి కావాల్సిన పబ్లిసిటీని తెచ్చిపెడుతూ.. తమ పేజ్ వ్యూస్ పెంచుకుంటోంది అని సినీ విశ్లేషకులు సినీ జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వర్మ 'పవర్ స్టార్' అనే సినిమా తీసినప్పుడు టాలీవుడ్ లో మెజారిటీ పీపుల్ ఆర్జీవీపై ఆగ్రహంగా ఉన్నారని.. అందుకే ఆ సినిమాని రిలీజ్ చేయడానికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ సైతం ముందుకు రాలేదని ఇండస్ట్రీలో వర్గాల్లో అనుకున్నారు. అయితే సదరు వెబ్ మీడియా మాత్రం పదే పదే ఆ సినిమా మీద ఆర్టికల్స్ పబ్లిష్ చేసి వాటిని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ ఆర్జీవీకి పబ్లిసిటీ చేసిందని.. ఆర్జీవీ మీద పరాన్నజీవిలా బ్రతుకుతోందని సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆర్జీవీ 'క్లైమాక్స్' 'నగ్నం' 'థ్రిల్లర్' వంటి సినిమాల్లో ఏదీ కూడా సమాజానికి లేదా ప్రేక్షకులకు ఉపయోగపడే సినిమా కాదని.. అయినప్పటికీ ఆ వెబ్ సైట్ వాటిని ఎక్కువగా ప్రమోట్ చేసి ఆడియన్స్ జేబులకు చిల్లులు పడేలా చేసిందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వర్మ ప్రకటించిన కొన్ని కాంట్రవర్సియల్ ప్రాజెక్ట్స్ ని హైలైట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తోందని.. పేజ్ వ్యూస్ కోసం ఆర్జీవీని టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ తీసే సినిమాలను ప్రమోట్ చేస్తున్నారని ఇండస్ట్రీ జనాలు డిస్కషన్ చేసుకుంటున్నారు. వర్మ తీసేవి నిజంగా మంచి సినిమాలు అయితే వాటిని ప్రమోట్ చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదని.. కానీ ఆర్జీవీ కావాలనే సినీ ప్రముఖులని టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నాడని తెలిసీ ఆ వెబ్ మీడియా ప్రచారం చేస్తోందని.. ఈ విధంగా వర్మ ఆ వెబ్ సైట్ ద్వారా పబ్లిసిటీ తెచ్చుకుంటుంటే.. అదే విధంగా ఆ వెబ్ మీడియా కూడా వర్మ ద్వారా లాభం పొందుతోందని సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News