వేధించిన వాడిని చితకబాదిన నటి!
బాలీవుడ్ విలక్షణ నటి దివ్యా దత్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అంతే తెగువ గల మహిళ అని తాజాగా ఓ పాత విషయాన్ని రివీల్ చేయడంతో బయట పడింది.;
బాలీవుడ్ విలక్షణ నటి దివ్యా దత్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అంతే తెగువ గల మహిళ అని తాజాగా ఓ పాత విషయాన్ని రివీల్ చేయడంతో బయట పడింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ , స్ఫూర్తిదాయకమైన సంఘటనను పంచుకున్నారు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆమె నిజ జీవితంలో కూడా తాను ఎంత ధైర్యవంతురాలినో? ఈ ఘటన ద్వారా నిరూపించుకున్నారు. తన కాలేజీ రోజుల్లో ఎదురైన ఓ వేధింపుల ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తాను ఎలా స్పందించిందో వివరించారు.
కాలేజీకి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి తనను వేధించడానికి ప్రయత్నించాడని, ఆ తరుణంలో భయపడి వెనకడుగు వేయకుండా అతడిని ఎదిరించానని దివ్య తెలిపారు. ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుని, అతడికి బుద్ధి వచ్చేలా అందరి ముందే చితకబాదినట్లు వెల్లడించారు. ఆ క్షణంలో తనలో కలిగిన ఆవేశం , ధైర్యం చూసి చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు కంగారు పడతారని కానీ తాను మాత్రం అతడికి సరైన పాఠం చెప్పాలని నిర్ణయించు కున్నానన్నారు.`ఆ రోజు తాను చూపిన చొరవ వల్ల ఆ వ్యక్తి మరెప్పుడూ తన దారిలోకి రాలేదన్నారు. ఈ సంఘటన తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు. తప్పును ఎదిరించడం ఎంత ముఖ్యమో నేర్పిందని అభిప్రాయపడ్డారు.
నేటి సమాజంలో మహిళలపై జరుగుతోన్న వేధింపుల నేపథ్యంలో దివ్యా దత్ పంచుకున్న ఈ అనుభవం యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. భయం అనేది మనల్ని బలహీనపరుస్తుందని అదే ధైర్యంతో ముందడుగు వేస్తే ఎంతటి వారినైనా ఎదుర్కోవచ్చని ఆమె మాటల ద్వారా చెప్పకనే చెప్పింది. ఆత్మరక్షణ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని వేధింపులను మౌనంగా భరించకూడదని గట్టిగా సందేశమిచ్చారు. దివ్యా బ్యూటీ షేర్ చేసిన పాత జ్ఞాపకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఆమె ఒక పవర్‌ఫుల్ ఉమెన్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా గొంతు ఎత్తాలని అవసరమైతే తిరగబడాలని చెప్పే ఆమె వ్యాఖ్యలు అందరినీ ఆలోజింపజేస్తాయి. అయితే దివ్యాదత్ లో ఈ తెగువ వెనుక తన తల్లి అందించిన పెంపకం ప్రోత్సాహం ఎంతో ఉంది. చిన్నప్పటి నుండే ఏ సమస్య ఎదురైనా వెనకడుగు వేయకూడదని ఆత్మగౌరవం కోసం పోరాడాలని తన తల్లి నేర్పించిన పాఠాలే ఆ రోజు తనను ఫైటర్లా మార్చాయని ఆమె గర్వంగా చెబుతున్నారు. కేవలం శారీరక బలం మాత్రమే కాకుండా మానసిక ధైర్యం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఈ సందర్భంగా నేటి తరం యువతకు హితవు పలికారు. వెండితెరపై సున్నితమైన భావోద్వేగపూరితమైన పాత్రల్లో కనిపించే దివ్య నిజ జీవితంలో ఇంతటి సాహసవంతురాలు అని తెలిసి నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.