పూరి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం...!
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకంగా చూసే దర్శకుడు పూరి జగన్నాథ్ అనడంలో సందేహం లేదు.;
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకంగా చూసే దర్శకుడు పూరి జగన్నాథ్ అనడంలో సందేహం లేదు. ఒకానొక సమయంలో ఏడాదిలో అత్యధిక సినిమాలను తీసి తోటి దర్శకులు సైతం అసూయ పడే విధంగా చేసిన దర్శకుడు పూరి. ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్ వంటి వారు పూరి వద్ద సినిమాలను స్పీడ్‌గా ఎలా తీయాలో నేర్చుకోవాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దర్శకుడు అంటే ఇలాగే ఉండాలి, దర్శకత్వం ఇలాగే చేయాలి అనే రూల్స్‌ను బ్రేక్ చేసిన దర్శకుడు పూరి అంటారు. అందుకే పూరి జగన్నాధ్‌కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఆడకపోవడంతో కొందరు ఆయనను విమర్శిస్తున్నారు. కానీ ఆయన గురించి తెలియాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాలంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.
సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ...
పూరి జగన్నాథ్‌కి అత్యంత ఆప్తుడిగా సంగీత దర్శకుడు రఘు కుంచెకి పేరుంది. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా టర్న్ తీసుకోవడంలో పూరి పాత్ర కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగర్‌గా రఘు కుంచెను ప్రోత్సహించిన పూరి జగన్నాథ్ తనకు సాధ్యం అయినంత వరకు సాయం చేసి, రఘును కెరీర్‌లో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు గాను హెల్ప్ చేశాడట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు రఘు స్వయంగా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాలో, సెలబ్రిటీ హోదాలో ఉన్న వారు పూరి వల్ల వచ్చిన వారే అనే టాక్ ఉంది. పూరి సాయంతో లేదా పూరి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారు ఇప్పుడు ఫేమస్ అయ్యారు. చాలా మంది ఇండస్ట్రీలో ఇప్పటికీ తాము పూరి వల్లే వచ్చాం, ఆయనే మాకు గాడ్ ఫాదర్ అంటారు. అందులో రఘు కుంచె కూడా ఒకరు అనడంలో సందేహం లేదు.
చక్రి గారికి చెప్పి మరీ పూరి జగన్నాథ్...
తాజాగా సంగీత దర్శకుడు రఘు కుంచె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన కెరీర్‌లో ఎక్కవ పాటలు పాడించిన సంగీత దర్శకుడు చక్రి, ఆయనకు చెప్పి నాకు పాటల అవకాశం ఇప్పించింది దర్శకుడు పూరి జగన్నాథ్. నేనింతే సినిమాలో ఓ నో నో... పాటను కార్తీక్‌తో పాడించాలని భావించారు. కానీ పూరి గారు పట్టుబట్టి మరీ ఆ పాటను నాతో పాడించారు. ఆయనకు నాపై ఉన్న నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఆ పాటను పాడాను. పూరి గారి జోక్యంతో నాకు చాలా పాటలు వచ్చాయి. ఆయన నన్ను ప్రత్యేక పాటల కోసం పలు సార్లు తీసుకోవడం జరిగింది. చక్రి గారికి కూడా నాపై నమ్మకం ఏర్పడింది. అందుకే ఎక్కువ పాటలను నాతో పాడించేందుకు ఆయన ఆసక్తి చూపించే వారు. పూరి సర్ సినిమాలో నా పాట కచ్చితంగా ఉండాలి అన్నట్లుగా అప్పట్లో చక్రి గారు అనుకునే వారు. పూరి గారికి హాలీవుడ్ మ్యూజిక్ పై మంచి పట్టు ఉండేది. అందుకే తన పాటల్లో హాలీవుడ్ రిఫరెన్స్‌లు వాడేవారు అన్నాడు.
మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం...
ఇంకా రఘు మాట్లాడుతూ... పూరి గారికి మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా మైకేల్ జాక్సన్ అంటే అమితమైన అభిమానం. మేము ఇద్దరం ఎక్కువగా మైకేల్ జాక్సన్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మైకేల్ జాక్సన్ చనిపోయిన సమయంలో పూరి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా బాధ పడ్డారు. ఆయన వంటి గొప్ప కళాకారుడిని కోల్పోవడం పట్ల పూరి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఏక్ నిరంజన్ సినిమాలో మైకేల్ జాక్సన్ స్ఫూర్తితో ఒక పాటను మణిశర్మ గారితో చేయించారు. టాలీవుడ్‌లో మైకేల్ జాక్సన్ స్ఫూర్తితో సినిమాను చేయడం కేవలం పూరికే చెల్లింది. చక్రి గారి మరణం గురించి చాలా మంది అసత్యాలు చెబుతూ ఉంటారు. ఆయన ఎక్కువ మద్యం తాగడం వల్ల చనిపోయారు అంటారు. కానీ ఆయన అదిక పని ఒత్తిడి, సరైన సమయంలో ఆహారం తినక పోవడం, ఎక్కువ బిర్యానీలు వంటివి తినడం వల్ల ఆయన ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే చనిపోయారని రఘు కుంచె చెప్పుకొచ్చారు.