హాలీవుడ్డోళ్లు ఇండియాను గౌరవించారండోయ్

Update: 2016-06-21 07:30 GMT
ఫలానా చోట చెప్పుల మీద లక్ష్మీదేవి బొమ్మ వేశారని.. ఫలానా సినిమాలో భారతీయుల్ని కించపరిచేలా చూపించారని.. ఇలా చాలా వింటూ ఉంటాం. కావాలనే మన మనోభావాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటారు. దీన్నో ఆటలాగా భావిస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా ఓ భారీ హాలీవుడ్ సినిమాలో భారతీయుల మనోభావాల్ని గౌరవించాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని సన్నివేశాల్ని నివారించారు. ఆ సినిమానే.. ఇండిపెండెన్స్ డే రిసర్జన్స్.

ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో భాగంగా ప్రపంచమంతా ధ్వంసమైనట్లు చూపించారు. అందుకోసం లాస్ వేగాస్ ను నేలమట్టం చేశారు. బుర్జు ఖలీఫాను కూల్చేశారు. లండన్.. సింగపూర్ ఇలా ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వేటినీ వదిలిపెట్టకుండా శిథిలాలుగా మార్చేశారు. కానీ భారత్ విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. దేశంలోని ఏ నగరాన్నీ ధ్వంసం చేస్తున్నట్లు చూపించలేదు. ఇండియా ఢిల్లీ - ముంబయి - బెంగళూరు - హైదరాబాద్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఇండియాకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రకారమైతే వీటిలో ఏదో ఒక నగరాన్ని ధ్వంసం చేయాలి. కానీ మన ప్రేక్షకుల మనోభావాల్ని దెబ్బ తీయకూడదనే ఇలా ఇండియాను ముట్టుకోకుండా వదిలేశారట.

ఇంతకుముందు ‘పిక్సెల్’ అనే హాలీవుడ్ సినిమాలో తాజ్ మహాల్ ధ్వంసమైనట్టు చూపించారు. ఐతే ఆ దృశ్యాన్ని మన సెన్సార్ బోర్డు సినిమా నుంచి తొలగించింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారతీయుల మనోభావాలు దెబ్బ తీయకూడదన్న ఉద్దేశంతో ఇలా చేసినట్లు ‘ఇండిపెండెన్స్ డే రిసర్జన్స్’ యూనిట్ వివరణ ఇచ్చింది. ‘‘భారతీయులు మరీ సున్నితంగా ఉంటారు. మత సంస్థలు.. మరిన్ని సంస్థల కార్యకర్తల సున్నితమైన మనోభావాలను దృష్టిలోపెట్టుకొని భారత్ లో ఈ సినిమా షూటింగ్ చేపట్టవద్దని.. ఈ సినిమాలో భారత్ కు సంబంధించిన ప్రముఖ కట్టడాలు కూలిపోయే దృశ్యాలు చూపించవద్దని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపింది నిర్మాణ సంస్థ.
Tags:    

Similar News