కంటెంట్ ఉంటే వెబ్ సిరీస్ ల‌తోనే బిగ్ స్టార్

Update: 2021-07-18 16:30 GMT
న‌వ‌త‌రం న‌టీన‌టుల‌కు ఓటీటీ మంచి వేదిక‌గా నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో అవ‌కాశాలు రాని వారంద‌రికీ వెబ్ సిరీస్ లు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. ఓటీటీ షోల‌తో ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు.. ఓటీటీల‌దే హ‌వా అన‌డంలో ఎంతమాత్రం సందేహం లేదు. బాలీవుడ్ టాప్ మేక‌ర్స్ అంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ల‌వైపే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారంటే.. భ‌విష్య‌త్ లో డిజిట‌ల్ సిరీస్ లు ఏ స్థాయికి చేరుకుంటాయి? ఓటీటీల ప్లాట్ ఫామ్స్ ఎంత‌గా ముందుకుసాగుతాయ‌న్న‌ది స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఓటీటీల రంగ ప్ర‌వేశం థియేట‌ర్ వీక్ష‌ణ‌ను మార్చేస్తోందని టాలీవుడ్ డీన్ డి.సురేష్ బాబు వ్యాఖ్యానించారంటే ఆయ‌న మాస్ట‌ర్ మైండ్ ఎంత‌గా ఆలోచించిందో అర్థం చేసుకోవాలి.

ఇప్పుడు పంక‌జ్ త్రిపాఠి లాంటి న‌టులు ఆ మాట‌నే ఉద్ఘాటిస్తున్నారు. ఓటీటీ కొత్త‌వారికి అవ‌కాశంతో పాటు మంచి భ‌విష్య‌త్ ని కూడా ఇస్తుందంటున్నారు. సినిమాల్లో అవ‌కాశాలు కోసం ఎదురు చూడ‌టం క‌న్నా వ‌చ్చిన చిన్న అవ‌కాశాన్ని వినియోగించుకుని మార్కెట్ క్రియేట్ చేసుకోవాల‌ని అంటున్నార‌న్నారు. ఏ వెబ్ సిరీస్ కైనా క‌థ ముఖ్యం. అందులో పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌ది ముఖ్యం కాదు. న‌ట‌న ఎలా ఉంది?  ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందా  లేదా? అన్న‌ది ముఖ్యం. ఆ కోణంలో ప్రేక్ష‌కులు న‌వ‌త‌రం న‌టుల్ని ఆద‌రిస్తున్నార‌ని పంక‌జ్ త్రిపాఠి అభిప్రాయ‌ప‌డ్డారు. `మిర్జాపూర్`- `సీక్రేడ్ గేమ్స్` వంటి క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ లు త‌న‌కెంతో మంచి పేరు తీసుకొచ్చాయ‌న్నారు.

`ది వైట్ టైగ‌ర్` అనే వెబ్ సిరీస్ లో న‌టించిన ఆద‌ర్శ్ గౌర‌వ్ ను బ్రిటీష్ అకాడ‌మీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అవార్డులలో లీడ్ యాక్టర్ విభాగంలో ఎంపిక చేశారు. డిజిట‌ల్ మాధ్యమాల ద్వారా   ప్రేక్ష‌కులు తాను ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే ఆద‌రించార‌ని..అందుకే ఇలాంటి గౌర‌వం ద‌క్కింద‌ని ఆద‌ర్శ్ అభిప్రాయప‌డ్డారు. అలాగే సినిమాల కోసం ఖ‌ర్చు చేసే భారీ మొత్తాల్ని వెబ్ సిరీస్ ల‌కు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వెబ్  సిరీస్ ల‌కు కంటెంట్ మాత్ర‌మే ముఖ్య‌మ‌ని.. పాత్ర‌ధారులు వాస్త‌విక‌త‌ను చూపించ‌గ‌లిగితే ఈ రంగంలో స‌క్సెస్ అయినట్లేన‌ని ఆద‌ర్శ్ గౌర‌వ్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుత డిజిట‌ల్ యుగంలో ప్రేక్ష‌కుల ఆలోచ‌న ధోర‌ణిలో కూడా చాలా మార్పులొస్తున్నాయ‌ని అన్నారు.

కేవ‌లం పంక‌జ్.. ఆద‌ర్శ్ వంటి ఏ కొంద‌రి అభిప్రాయ‌మో కాదు.. నేటిరోజుల్లో చాలా మంది అగ్ర క‌థానాయిక‌లు అగ్ర హీరోలు ఓటీటీల్లో న‌టించి పేరు తెచ్చుకోవాల‌ని చూస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో రాజీ పాత్ర‌తో అక్కినేని కోడ‌లు స‌మంత ఫేట్ అమాంతం ఆరింది. త‌న ద‌శ దిశ తిప్పేసిన‌ది వెబ్ సిరీస్ మాత్ర‌మేన‌ని ఉదహ‌రిస్తున్నారు. సినిమాల‌తో కంటే వెబ్ సిరీస్ తో ఇరుగు పొరుగు భాష‌ల్లో రీచ్ అవ్వ‌డం చాలా సుల‌భం అని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News