సలార్2 వార్తల్లో నిజమెంత?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్, ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్, ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. బాహుబలి తర్వాత డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ చేతిలో అవి కాక మరికొన్ని సినిమాలున్న విషయం అందరికీ తెలుసు.
సలార్ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్
కాగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కాకుండా రెండు సినిమాల సీక్వెల్స్ లో నటించాల్సి ఉంది. అవే సలార్2, కల్కి2. అయితే తాజా సమాచారం ప్రకారం సలార్2 వర్క్స్ త్వరలోనే ప్రారంభమవనున్నాయని తెలుస్తోంది. సలార్ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉందో చెప్పే పన్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డార్లింగ్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించి అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నారు.
సలార్2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
బాక్సాఫీస్ వద్ద కూడా సలార్ సినిమా బాగా పెర్ఫార్మ్ చేసి ఎన్నో రికార్డులను అందుకుంది. సలార్ సినిమాకు సీక్వెల్ కు సలార్2 వస్తుందని మేకర్స్ అప్పట్లోనే చెప్పగా, ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి ఎదురుచూపులు ఫలించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సలార్2 గురించి అప్డేట్
జనవరి 25 లేదా 26 తేదీల్లో సలార్2 కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ టీజర్ రానుందని వార్తలొస్తున్నాయి. ఈ విషయమై నిర్మాణ సంస్థ నుంచి కానీ, డైరెక్టర్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేకపోయినా సలార్2 గురించి వస్తున్న వార్తలు అందరినీ ఎంతో ఎగ్జైట్ చేస్తున్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ కు సంబంధించిన వర్క్స్ తో పాటూ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలయ్యాయని, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరుగుతుంది.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా షూటింగుతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, ఆ సినిమాను పూర్తి చేయకుండానే సలార్2 ను ఎలా మొదలుపెడతారని కొందరంటుంటే, ముందు సినిమాను అనౌన్స్ చేసి బజ్ పెంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అవగానే సలార్2 ను మొదలుపెడతారని మరికొందరంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.