'ధురంధర్2' టీజర్ రెడీ..ఇక అంతా భీభత్సమే?
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సెన్సేషనల్ మూవీ డిసెంబర్ 5న ఓ మోస్తారు అంచనాలతో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తోంది.;
`ధురంధర్`..బాలీవుడ్‌కు సరికొత్త ఊపిరులూదిన సినిమా. గత కొంత కాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం బాలీవుడ్ ఎదురుచూస్తున్న తరుణంలో ఆ లోటుని తీర్చడమే కాకుండా ఇండియన్ సినిమాకు సరికొత్త మేకింగ్‌ని పరిచయం చేసిన సినిమా ఇది. సిరీస్ తరహాలోనూ సినిమాని రూపొందించి బాక్సాఫీస్ వద్ద రికార్డులతో భీభత్సం సృష్టించొచ్చని దర్శకుడు ఆదిత్యధర్ ఈ సినిమాతో నిరూపించాడు. సినిమా మేకింగ్ టేకింగ్ విషయంలో హాలీవుడ్ తోనూ పోటీపడుతున్న నేపథ్యంలో మేకింగ్ పరంగా ఇండియన్ ఇండస్ట్రీకి సరికొత్త మార్గాన్ని చూపించి ఔరా అనిపించాడు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సెన్సేషనల్ మూవీ డిసెంబర్ 5న ఓ మోస్తారు అంచనాలతో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తోంది. కొంత మంది ప్రాపగాండ ఫిల్మ్ అని విమర్శలు చేసినా.. పాక్ వ్యతిరేక మూవీ అని అక్కసు వెళ్లగక్కినా `ధురంధర్`ని ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా ఫ్రీ పబ్లిసిటీ భారీ స్థాయిలో రావడం, సినిమాలో షాకింగ్ కంటెంట్ ఉండటం, పాక్ దుష్టబుద్దిని బయటపెట్టే అంశాలు చాలా వరకు ఓపెన్‌గా ఈ మూవీలో బయటపెట్టడంతో `ధురంధర్` ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేస్తోంది.
సినిమా విడుదలై 40 రోజులుపైనే అయినా ఇప్పటికీ అదే స్థాయిలో స్ట్రాంగ్‌గా నిలబడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది. ఇప్పటి వరకు రూ.1300 కోట్ల పై చిలుకు వసూళ్లని రాబట్టి పలు కీలక రికార్డుల్ని బ్రేక్ చేసింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా రానున్న `ధురంధర్ 2:ది రివెంజ్`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ల్యారీలో కీలకంగా మారిన గ్యాంగ్‌స్టర్ రెహమాన్ క్యారెక్టర్ ఎండ్‌తో ఫస్ట్ పార్ట్‌కు ముగింపు పలికిన ఆదిత్యధర్ సెకండ్ పార్ట్‌లో మాత్రం ఓ రేంజ్‌లో భీభత్సాన్ని సృష్టించబోతున్నాడట. దీంతో ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అందరి ఎదురు చూపులకు తెరదించుతూ మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ టీజర్‌ని జనవరి 23న రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. అంతే కాకుండా టీజర్‌లో ఊహించని సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్‌లు ఉండే అవకాశం ఉందని తెలిసింది. టీజర్ రన్ టైమ్ వన్ మినట్ 48 సెకన్లు. ఫస్ట్ పార్ట్ ఎండ్‌లో పార్ట్ 2కు సంబంధించి కొన్ని షాట్స్‌ని చూపించారు. అందులో రెహమాన్ డకాయిత్ చనిపోవడంతో అతని స్థానంలోకి వచ్చిన హమ్జా క్రిమినల్స్‌ని ఏరివేసే ఆపరేషన్ మొదలు పెట్టినట్టుగా చూపించారు. టీజర్‌లో వాటిని మరింత డిటైలింగ్ చూపిస్తారని తెలుస్తోంది.
అంతే కాకుండా పార్ట్ 1 స్టోరీ అసలు కథ మొదలయ్యే దగ్గరే ఆగింది. అంటే `ధురంధర్ 2:ది రివేంజ్`లో పేరుకు తగ్గట్టే ప్రతీకార సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయని స్పష్టమయింది. అందుకే టీజర్‌లో హమ్జాగా రణ్‌వీర్ భీభత్సాన్ని చూపించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టీజరే భీభత్సం సృష్టిస్తే మార్చి 19న రిలీజ్ కానున్న సినిమా ఏరేంజ్‌లో భీభత్సం సృష్టిస్తుందో తెలియాలంటే మార్చి 19 వరకు వేచి చూడాల్సిందే. త్వరలోనే ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఆదిత్యధర్ పార్ట్ 2లోనూ రెహమాన్ డకాయత్ క్యారెక్టర్‌ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చూపించబోతున్నాడని ఇన్ సైట్ టాక్.