జగన్ కీ .. పవన్ కి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు!

Update: 2022-02-09 07:30 GMT
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తరువాత హీరోగా సుమంత్ వచ్చాడు. అయితే మొదటి నుంచి కూడా సుమంత్ చకచకా సినిమాలు చేసేయాలనే ఆరాటాన్ని కనబరచలేదు. తన దగ్గరికి వచ్చిన కథలలో తనకి నచ్చినవి మాత్రమే చేస్తూ తాపీగా ముందుకు వెళుతున్నాడు. ఆయన కెరియర్లో ఇంతవరకూ వచ్చిన సినిమాలో రెండు మూడు బాగానే ఆడాయి. ఆ తరువాత వరుస పరాజయాలు పలకరిస్తూ వస్తున్నాయి. అయినా ఆయన డీలాపడి పోకుండా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా  ముందుకు వెళుతున్నాడు.

సుమంత్ ప్రత్యేకత ఏమిటంటే అవకాశాలు తగ్గాయని చెప్పేసి ఆయన ఎప్పుడూ కూడా వేరే సినిమాల్లో కనిపించడానికి ప్రయత్నించకపోవడం. కేరక్టర్ ఆర్టిస్టుగా ముందుకు వెళదామని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అలాగే వేరే హీరోల సినిమాల్లో గెస్టుగా కనిపించే ఆలోచన కూడా ఆయన చేయలేదు. ఇక బయట సినిమా ఫంక్షన్స్ లో కూడా సుమంత్ ఎక్కడా కనిపించడు. ఆయన తాజా చిత్రంగా  'మళ్లీ మొదలైంది' ప్రేక్షకుల ముందుకురానుంది. తాజా ఇంటర్వ్యూలో తనకి ఎదురైన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.

"మొదటి నుంచి కూడా నేను నా పనేదో చూసుకుంటూ వెళుతుంటాను. నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు? ఎలాంటి పుకార్లు వస్తున్నాయి? అనేది నేను ఎంతమాత్రం పట్టించుకోను. నా పనేదో నేను చూసుకుంటూ వెళుతుంటాను.

వైఎస్ జగన్ నాకు స్కూల్ డేస్ నుంచి తెలుసు. ఆయన రాజకీయాల్లో చాలా పెద్ద స్థాయికి వెళతాడని నేను అప్పట్లోనే అనుకున్నాను. నాకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. వింటూ ఉంటాను గానీ .. దగ్గరగా వెళ్లి పరిశీలించడానికి ప్రయత్నం చేయను.

న్యూస్ పేపర్స్ చదవడం .. వెబ్ సైట్స్ చూడటం నాకు అలవాటు లేదు. పవన్ రాజకీయాలలోకి వెళ్లాడని నాకు తెలుసు. కానీ జగన్ కీ .. పవన్ కి మధ్య ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. నేను నాదైన ఒక లోకంలో ఉంటాను .. అందువలన నాకు తెలియదు. అందువల్లనే  నాకు తెలియని రాజకీయాలను గురించి నేను ఎక్కడా కామెంట్ చేయను.

పవన్ కల్యాణ్ గారిని నేను కలిశాను .. మాట్లాడాను. అది కేవలం సినిమాలను గురించి మాత్రమే. రాజకీయాలకు సంబంధించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు .. నాకు తెలియదు గనుక నేను ప్రస్తావించనూ లేదు" అని చెప్పుకొచ్చాడు. 
Tags:    

Similar News