బ్రేకింగ్: ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు జీవోని రద్దు చేసిన హైకోర్ట్

Update: 2021-12-14 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో నెం.35 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. దీంతో థియేటర్లలో ఒకప్పటి టికెట్ రేట్లు యధాతథంగా కొనసాగనున్నాయి.

కాగా, టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ థియేటర్‌ యజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని.. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్లకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఈరోజు మంగళవారం ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణ రావు - దుర్గా ప్రసాద్‌ పిటిషనర్ల తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు. టికెట్‌ ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని విన్నవించారు.

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News