హీరోల పక్కన ఉండడం.. సారీలు చెప్పడం కాదు.. ఇకనైనా అవి మానుకోండి..: సమంత

ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువసార్లు “సారీ” అంటారని సమంత చెప్పింది.;

Update: 2026-03-27 05:19 GMT

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. మహిళల గురించి తన అభిప్రాయాన్ని ఎంతో ఎమోషనల్ గా ఒక ఈవెంట్లో చెప్పుకొచ్చింది. హాలీవుడ్ రిపోర్టర్ వాళ్లు.. ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. ముఖ్యంగా మహిళలు తమ గుర్తింపును పొందడానికి మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె పేర్కొంది.

సమంత మాట్లాడుతూ.. మహిళలు తమ వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా, వృత్తి జీవితంలో కూడా ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుందని తెలిపింది. చాలా సందర్భాల్లో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని చెప్పింది. ఈ మార్పులను వారు సహజంగా స్వీకరించడంతో పాటు.. అది త్యాగమని కూడా భావించకుండా ముందుకు సాగుతారని ఆమె అభిప్రాయపడింది.

ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువసార్లు “సారీ” అంటారని సమంత చెప్పింది. ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా భావించవచ్చని ఆమె అభిప్రాయం. ప్రతీ చిన్న విషయానికీ క్షమాపణ చెప్పడం అవసరం లేదని, ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలని ఆమె సూచించింది.

మహిళలు తమకు తాము విలువ ఇవ్వడం చాలా అవసరమని సమంత పేర్కొంది. తమ సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి అని ఆమె చెప్పింది. ఎవరో ప్రశంసించినప్పుడు దాన్ని తక్కువ చేసి చూడకుండా, సింపుల్‌గా “ధన్యవాదాలు” చెప్పడం సరైనదే అని సూచించింది. అంబిషన్ ఉండటం తప్పు కాదని, ముందుకు వెళ్లాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆమె స్పష్టం చేసింది.

భవిష్యత్తుపై తన ఆశలను కూడా సమంత వ్యక్తం చేసింది. ఒక రోజు వస్తుందని, ఆ రోజున మహిళల కథలను ప్రత్యేకంగా “ఫీమేల్ లీడ్” అంటూ చెప్పాల్సిన అవసరం ఉండదని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. మహిళా పాత్రలు కూడా సాధారణ కథలలో భాగంగా ఉండే స్థాయికి చేరుకోవాలని ఆమె కోరుకుంది.

సినిమాలలో మహిళా పాత్రలు బలంగా, నిజ జీవితానికి దగ్గరగా ఉండాలని సమంత అభిప్రాయం వ్యక్తం చేసింది. “ ఎవరికో ఒకరికి భార్యగా కాకుండా..వారు కేవలం హీరోకు సపోర్ట్ చేసే పాత్రలుగా కాకుండా, స్వతంత్ర వ్యక్తిత్వంతో కనిపించాలి. ప్రతి మహిళా పాత్రకు తనదైన ప్రాధాన్యం ఉండాలి. అలాంటి రోజు వస్తుంది అని కలగంటున్నాను,” అని చెప్పుకొచ్చింది సమంత.

చివరగా, సినిమా షూటింగ్ సెట్లలో భద్రత చాలా ముఖ్యమని సమంత పేర్కొంది. అది ఒకసారి మాత్రమే చర్చించే విషయం కాకుండా, ప్రతి రోజు పాటించాల్సిన నియమంగా మారాలని ఆమె కోరుకుంది. ప్రతి మహిళా నటి సెట్‌లో సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో పని చేయగలగాలని ఆమె ఆకాంక్షించింది.

ఇక ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో ఈ హీరోయిన్ మాట్లాడిన మాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News