ఆదిత్యాధర్ (Vs) అగ్నిహోత్రి: ఆపరేషన్ సింధూర్‌కి ఎవరు బెస్ట్?
లెఫ్టినెంట్ జనరల్ కే.జే.ఎస్. థిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా 2025 పహల్గాం ఘటన తర్వాత భారత్ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో సినిమా చిత్రీకరణకు సన్నాహకాలపై చర్చ సాగుతోంది.;
బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా `దురంధర్` ఫ్రాంఛైజీ గురించే చర్చ సాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో `ఆపరేషన్ సింధూర్` తెరపైకి వచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ కే.జే.ఎస్. థిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా 2025 పహల్గాం ఘటన తర్వాత భారత్ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో సినిమా చిత్రీకరణకు సన్నాహకాలపై చర్చ సాగుతోంది. ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఇటువంటి భారీ యుద్ధ తంత్రానికి సంబంధించిన కథను వివేక్ అగ్నిహోత్రి కంటే `యూరి`, `దురంధర్` చిత్రాల దర్శకుడు ఆదిత్యా ధర్ తీస్తేనే బాగుంటుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్నిహోత్రి గత చిత్రాలైన ది కాశ్మీర్ ఫైల్స్, ది బెంగాల్ ఫైల్స్ వంటివి కేవలం భావోద్వేగాలను ఒక ప్రత్యేక ఎజెండాను మాత్రమే నమ్ముకున్నాయని.. కానీ యుద్ధ రంగంలోని ఎలివేషన్లను చూపే సత్తా ఆయనకు లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివేక్ అగ్నిహోత్రి మేకింగ్ స్టైల్ పై నెటిజన్లలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన సినిమాల్లో `కల్ట్` అంశాలను చాలా లైట్ వెయిట్ తో చూపిస్తారని.. యుద్ధానికి ఉండాల్సిన గాంభీర్యం, భారీతనం ఆయన మేకింగ్‌లో కనిపించవని కొందరు క్రిటిసైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీ-సిరీస్ - ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాలీవుడ్ పతనం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన అగ్నిహోత్రి ఇప్పుడు మళ్ళీ అదే ఇండస్ట్రీ పెద్దలతో చేతులు కలపడం ఆయన ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. కేవలం వాస్తవ కథల పేరుతో ఒకే రకమైన నెరేటివ్‌ను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శకులు వాదిస్తున్నారు.
మరోవైపు ఆదిత్యా ధర్ పేరు ఈ రేసులోకి రావడం వెనుక బలమైన కారణం ఉంది. `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` సినిమాతో దేశభక్తిని, సైనిక వ్యూహాలను వెండితెరపై ఎలా ఆవిష్కరించాలో అతడు నిరూపించారు. `ఆపరేషన్ సింధూర్` వంటి సెన్సిటివ్ , పవర్ ఫుల్ సబ్జెక్టును ఆదిత్యా ధర్ అయితేనే సరైన ఎలివేషన్లతో సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తీయగలరని సినీ ప్రియులు భావిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక వింతైన వాదన కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఆదిత్యా ధర్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించినా అతడిపై ``కేవలం దేశభక్తి సినిమాలు తప్ప మరే జోనర్ తీయలేరు` అనే ముద్ర పడిపోతుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త ఐడియాల వైపు వెళ్లకుండా పదే పదే దేశభక్తి, యుద్ధం, పాకిస్థాన్ దాడుల చుట్టూనే కథలు తిరుగుతున్నాయని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. `ఆపరేషన్ సింధూర్` కేవలం యుద్ధం మాత్రమే కాదని, సైనిక వ్యూహం, ధైర్యసాహసాల కలయిక అని మేకర్స్ చెబుతున్నా.. తీయబోయే సినిమా ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటుందో అన్నది అనుమానమే. అగ్నిహోత్రి తన పాత పద్ధతిలోనే నెరేటివ్ ఫిల్మ్ తీస్తారా లేక ఆదిత్యా ధర్ రేంజ్ లో విజువల్ ట్రీట్‌ను అందిస్తారా అనేది ఇప్పుడు జవాబు లేని ప్రశ్న.
`ఆపరేషన్ సింధూర్` చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం బాలీవుడ్ లో కొత్త మంటలను రేపుతోంది. వివేక్ అగ్నిహోత్రి తిరిగి ఇండస్ట్రీలోకి రావడం.. దేశభక్తి కథలతో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవడం ఒక వర్గానికి నచ్చడం లేదు. ఆదిత్యా ధర్ వంటి ప్రతిభావంతులైన దర్శకులకి ఇటువంటి కథలు ఇస్తే అవి గ్లోబల్ స్థాయిలో హిట్ అవుతాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. మరి భూషణ్ కుమార్ అండ్ టీమ్ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటుందో.. అగ్నిహోత్రి తన మేకింగ్ తో అందరి నోళ్లు ఎలా మూయిస్తారో వేచి చూడాల్సిందే.