స్పెషల్ స్టోరీ: టాప్ లీగ్ లో చేరగలిగే సత్తా ఉన్న హీరోలు..!

Update: 2021-04-02 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా లెక్కపెడితే సీనియర్ స్టార్ హీరోలు - స్టార్ హీరోలు కలిపి పది మంది మాత్రమే ఉన్నారు. వీరందరూ ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా ఉంటుంది. ఏడాదిలో మిగతా రోజులు ప్రేక్షకులను అలరించించేది మీడియం రేంజ్ టైర్-2 హీరోల సినిమాలే అని చెప్పవచ్చు. వీరు ఎన్ని సినిమాలు సాధ్యమైతే అన్ని సినిమాలు చేస్తూ తెలుగు సినిమా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. వీరిలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి నిలదొక్కుకున్నవారు కొందరైతే.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలో నిలబడినవారు కొంతమంది. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న యువ హీరోలలో టాప్ లీగ్ లో చేరగలిగే సత్తా ఉన్నవారెవరో ఒకసారి చూద్దాం.

'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రేక్షకులతో నేచురల్ స్టార్ అనిపించుకునే స్థాయికి వచ్చాడు. మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతల హీరోగా పిలవబడే నాని.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'టక్ జగదీష్' చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసి 'శ్యామ్ సింగ రాయ్' షూటింగ్ చేసేస్తున్నాడు. ఇదే క్రమంలో 'అంటే.. సుందరానికీ!' అనే సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ మూడు సినిమాలు హిట్ అయితే నాని మార్కెట్ కూడా విస్తరించే అవకాశం ఉంది.

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పచుకున్న వీడీ.. సెన్సేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో 'గీతగోవిందం' సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో చేస్తున్న 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ.. శివ నిర్వాణ - ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ వంటి దర్శకులతో సినిమాలు లైన్లో పెట్టాడు. 'లైగర్'తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తే విజయ్ దేవరకొండ త్వరలోనే టాప్ లీగ్ లో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో నటించిన మాస్ మహారాజా రవితేజ.. స్టార్ హీరోలకు - మీడియం రేంజ్ హీరోలకు మధ్య వారధిగా నిలిచాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోయే రవితేజ.. ఆ మధ్య సరైన సక్సెస్ లేక కాస్త వెనుకబడిపోయాడు. అయితే 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా కోవిడ్ సమయంలో సినీ ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం 'ఖిలాడి' అనే సినిమాలో నటిస్తూ.. త్రినాథరావు నక్కిన తో ఓ సినిమా లైన్ లో పెట్టాడు.

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువసామ్రాట్ నాగచైతన్య.. కెరీర్ ఆరంభంలో తడబడినా ఇప్పుడు లైన్ లోకి వచ్చాడు. గతేడాది 'మజిలీ' 'వెంకీమామ' వంటి వరుస సూపర్ హిట్స్ తో మార్కెట్ ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేసిన 'లవ్ స్టోరీ' సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్న చైతన్య.. త్వరలో తన తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నటించనున్నాడు. అంతేకాక అమీర్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతున్న చైతూ కూడా స్టార్ హీరో స్టేటస్ కోసం గట్టుగానే ట్రై చేస్తున్నాడు.

'జయం' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్.. 'దిల్' 'సై' 'ఇష్క్‌' 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో 'అ ఆ' ‘భీష్మ’ సినిమాలతో మార్కెట్ ని కూడా విస్తరించుకున్నాడు. తాజాగా 'రంగ్ దే' సినిమాతో మరో హిట్ తన ఖాతాలో  వేసుకున్న నితిన్.. ప్రస్తుతం 'మాస్ట్రో' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో దూకుడుమీదున్న నితిన్.. స్టార్ హీరోల సరసన చేరడానికి బాగానే కష్టపడుతున్నాడు.

యంగ్ హీరో రామ్ పోతినేని 'దేవదాస్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. యాక్టింగ్ తోనే కాకుండా డాన్సులు ఫైట్స్‌ లో ఆడియన్స్ కి దగ్గరైన ఉస్తాద్ రామ్.. 'రెడీ' 'కందిరీగ' 'పండగ చేస్కో' 'నేను శైలజ' సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. 'రెడ్' సినిమాతో పర్వలేదనిపించిన రామ్.. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండే ఈ యువ హీరో కూడా టాప్ లీగ్ లో చోటు కోసం కష్టపడుతున్నాడు.

దగ్గుబాటి వారసుడిగా 'లీడర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా.. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ సినిమాలలో కూడా నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే 'అరణ్య' సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో 'విరాటపర్వం' అనే మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడు. సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కమర్షియల్ చిత్రాల వెనుక పరుగులు తీయకుండా కంటెంట్ ని నమ్మి సినిమాలు చేస్తున్నాడు.

వర్సటైల్ హీరో శర్వానంద్ కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న పాత్రల్లో నటించిన శర్వా.. ఇప్పుడు హీరోగా బిజీ అయిపోయాడు. వైవిధ్యమైన సినిమాలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందితున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా సస్టార్ట్ చేసే శర్వానంద్.. ఈ మధ్య రేసులో కాస్త వెనుకబడ్డాడు. అయినప్పటికీ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం 'మహాసముద్రం' 'ఆడాళ్లు మీకు జోహార్లు' వంటి సినిమాలతో నటిస్తున్నాడు. అలానే కొత్త దర్శకుడితో ఓ ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తి చేశాడు. ఇక ఏసియన్ ప్రొడక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడని తెలుస్తోంది.

అక్కినేని మరో వారసుడు అఖిల్ సాలిడ్ హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్ ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో #అఖిల్5 సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే అఖిల్ కెరీర్ గాడిలో పడే అవకాశం ఉంది. అలానే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ - సూపర్ స్టార్ బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు కూడా వరుస హిట్స్ తో సత్తా చాటుతున్నారు. యువ హీరో నిఖిల్ వంటి హీరోలు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కువడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇలా వీరందరూ సినిమా కోసం కష్టపడుతూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. మరి వీరిలో టాలీవుడ్ మూల స్తంభాలుగా.. టాప్ స్టార్స్ గా ఎవరెవరు నిలుస్తారో చూడాలి.
Tags:    

Similar News