ప్రముఖ నటి హత్య కేసులో తుది తీర్పు నేడే.. న్యాయం జరిగేనా?
అసలు ప్రత్యూష మరణానికి గల కారణాలేంటి? ఆమె ఎలా చనిపోయింది? అనే విషయానికి వస్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేస్తూ తన నటనతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె మరణించారు;
అద్భుతమైన నటనతో.. అందంతో.. అభినయంతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న ప్రముఖ నటి ప్రత్యూష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా 90'స్ యువతకు ఈమె డ్రీమ్ గర్ల్ అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఈమె 2002లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది..ఈమె మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దాదాపు 24 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అటు సినీ పరిశ్రమే కాదు యావత్ భారతదేశం ఈ తీర్పు కోసం ఎదురుచూస్తోంది.
హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడు. అయితే దానికి కౌంటర్ గా నటి ప్రత్యూష తల్లి సరోజినీ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా నిందితుడికి శిక్ష పెంచాలి అంటూ ఆమె గత సంవత్సర నవంబర్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కగా.. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజినీ వేసిన పిటిషన్ల పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఈరోజు తుది తీర్పు ఇవ్వనుంది. అయితే ఇలాంటి సమయంలో కోర్టు సిద్ధార్థ రెడ్డికి శిక్షా కాలం గడువు పెంచుతుందా ? లేక తగ్గిస్తుందా? అసలు ప్రత్యూష కి ఈ కేసులో న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అసలు ప్రత్యూష మరణానికి గల కారణాలేంటి? ఆమె ఎలా చనిపోయింది? అనే విషయానికి వస్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేస్తూ తన నటనతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె మరణించారు . 2002 ఫిబ్రవరి 23న తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డి తో కలిసి ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆ ప్రయత్నంలో ప్రత్యూష చికిత్స పొందుతూ మరణించగా.. సిద్ధార్థ రెడ్డి మాత్రం కోలుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి వల్లే కూతురు చనిపోయిందని అతనిపై కేసు పెట్టింది ప్రత్యూష తల్లి సరోజిని. దీంతో సిద్ధార్థ రెడ్డి జైలుకి వెళ్లారు
ఇకపోతే నేడు సుప్రీం కోర్టులో ప్రత్యూష కేసు తుది తీర్పుకు రావడంతో గతంలో ఆమె తల్లి సరోజినీ చేసిన వ్యాఖ్యలు కూడా నేడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. గత నాలుగు సంవత్సరాల క్రితం ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో మాట్లాడుతూ.. ప్రత్యూష చనిపోయే ముందు రోజు సిద్ధార్థ తో కలిసి బయటకు వెళ్ళింది. ఆ సమయంలో 'జయం' సినిమాలో ఆమెను హీరోయిన్గా ఓకే చేశారు. ఇక దాంతో జయం సినిమా కోసం ఆఫీస్ కి వెళ్లి వస్తానని చెప్పింది. అయితే అదే ఆమె చివరి మాటలు అవుతాయని నేను అనుకోలేదు.. నా కూతురు చనిపోయిన మూడు రోజుల తర్వాత ఆమె చనిపోయిన హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పనిచేసే వాళ్ళతో మాట్లాడాను. అయితే వారు చెప్పిన నిజాలు తెలిసి ఆశ్చర్యపోయాను..
ఒక కారు వేగంగా హాస్పిటల్ కి వచ్చిందని.. అందులో నుంచి ఒక అమ్మాయిని వీల్ చైర్ లో తీసుకెళ్లారని, అప్పటికే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి ఉందని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారు. నిజంగా అమ్మాయితో పాటు అబ్బాయి కూడా విషం తాగితే సిద్ధార్థ రెడ్డి ఆసుపత్రి వరకు ఎలా వచ్చారు ? ఎలా ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాడు ? అంటూ ఆమె ప్రశ్నించారు. అనుమానం రాకూడదనే సిద్ధార్థ కూడా ఆసుపత్రిలో జాయిన్ అయి.. తాను కూడా విషం తాగినట్లు అందర్నీ నమ్మించారు . ప్రత్యూష కు సంబంధించిన బట్టలు కూడా ఇవ్వలేదు.. ఎందుకు ఇవ్వలేదని అడిగితే చికిత్స సమయంలో మోషన్ చేయడం వల్లే వాటిని వర్కర్స్ అన్నింటితో పాటు పడేస్తుంటారని ఆసుపత్రి వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పేసారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆసుపత్రి వైద్యులే ఆధారాలు మాయం చేశారని.. సరోజినీ ఆవేదన వ్యక్తం చేసింది . మరి ప్రత్యూష మృతి కేసులో ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది .మరి ఈ కేసులో ప్రత్యూష న్యాయం జరుగుతుందా? సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిస్తుందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్స్ . అభిమానులు మాత్రం ప్రత్యూష కి న్యాయం చేకూరాలని కోరుతున్నారు. మరి ఏం జరగనుందో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.