ఆ ఒక్క సీన్ కోసం 12 రాత్రులు షూట్ చేశారట

Update: 2020-02-12 04:30 GMT
కొన్ని సినిమాలు క్లాప్ కొట్టటానికి కొన్ని రోజుల ముందు నుంచే విపరీతమైన ప్రచారానికి నోచుకుంటాయి. అందుకు భిన్నంగా మరికొన్ని సినిమాలు టైటిల్ లోగో బయటకు వచ్చే వరకూ కూడా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఒకటి జరిగిందన్న విషయం కూడా బయటకు రాదు. పెద్ద హీరోలు.. కమర్షియల్ ఎలిమెంట్ ఉండే సినిమాలు.. క్రేజీ కాంబినేషన్ తో తీసే వాటికి మీడియా ఇచ్చే ప్రాధాన్యత.. ఒక మంచి సినిమాను తీయాలని తపించే వాటికి ఇవ్వరు.

మంచి సినిమాలు రావాలని చెప్పేటోళ్లు కూడా.. క్రేజీ సినిమాలు చూసేందుకు.. మసాలా దట్టించిన మూవీలకు వెళ్లేందుకు చూపించే ఆసక్తి.. ఒక మెసేజ్ ఒరియంటెడ్ మూవీల పట్ల పెద్ద ఉత్సాహాన్ని చూపించరు. కొన్ని సందర్భాల్లో చాలామంచి సినిమాలు విడుదల కావటం.. వెళ్లిపోతుంటాయి కూడా. ఎప్పుడైనా టీవీల్లో వస్తే.. అరే.. ఇంత మంచి సినిమా ఎలాంటి బజ్ లేకుండా అలా ఎలా వెళ్లిపోయిందన్న ఆశ్చర్యానికి గురి అవుతుంటాం.

తాజాగా తీసిన ఒక మూవీ అదే కోవలోకి వెళ్లేదేమో? కానీ.. ఆ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆ సినిమాకు ప్లస్ గా మారిందని చెప్పాలి. భిన్నమైన చిత్రాల్ని తీసే దర్శకుడిగా ఉమామహేశ్వరరావుకు పేరుంది. ఆయన పేరు చెప్పినంతనే అప్పట్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అంకురం మూవీ గుర్తుకు వస్తుంది. రేవతి ప్రధాన పాత్రగా పోషించిన ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే దర్శకుడు ఇట్లు అమ్మ పేరుతో ఒక భిన్నమైన సినిమాను తీస్తున్నారు. ఈ మూవీలోనూ ప్రధాన పాత్ర సీనియర్ నటి రేవతినే. మహిళ సమాజాన్ని తెలుసుకోవాలి.. తమ అభిప్రాయాల్ని గొంతెత్తి చెప్పాలన్న ప్రయత్నం చేసే ఒక మహిళ కథగా చెబుతున్నారు. ఒక అమ్మ ప్రయాణంగా ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం పడుతున్న రాత్రి అనే వాక్యంతో ఈ సినిమా కథ మొదలవుతుందని.. ఆ ఒక్క సన్నివేశాన్ని షూట్ చేసేందుకు దర్శకుడు ఏకంగా 12 రాత్రులు తీసుకున్నారని చెప్పారు నటి రేవతి. ఇదొక్క అంశం చాలు.. సినిమా తీసే విషయంలో దర్శకుడు ఎంతలా కష్టపడింది చెప్పుకొచ్చారు. మరింత కష్టపడిన సినిమా ప్రేక్షకుల అటెన్షన్ పొందుతుందా? అన్నది ప్రశ్నే.


Tags:    

Similar News