‘యుఫోరియా’లో చిరు నటించి ఉంటే..?

ఈ క్యారెక్టర్‌ను చిరుతో చేయించేందుకు సంప్రదింపులు కూడా జరిగినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.;

Update: 2026-02-11 14:30 GMT

టాలీవుడ్లో ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవా సీనియర్ దర్శకుడు గుణశేఖర్. మెగాస్టార్ చిరంజీవితో ‘చూడాలని ఉంది’, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘ఒక్కడు’ లాంటి భారీ విజయాలందుకున్న గుణ.. ఆ తర్వాత కూడా పెద్ద బడ్జెట్లో అర్జున్, సైనికుడు, రుద్రమదేవి, శాకుంతలం లాంటి సాహసోపేత సినిమాలు చేశారు. ఐతే తాజాగా ఆయన ఎక్కువ కొత్త నటీనటులను పెట్టి ‘యుఫోరియా’ అనే చిన్న చిత్రం తీశారు.

గుణశేఖర్ శైలికి ఇది భిన్నమైన సినిమా. ఐతే మంచి సందేశంతో కూడిన కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో కొన్ని ఎపిసోడ్లు బాగున్నా.. ఓవరాల్‌గా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హైలైట్ అని చెప్పుకోదగ్గ పాత్రల్లో గౌతమ్ మీనన్ పోషించిన కమిషనర్ క్యారెక్టర్ ఒకటి. నిజానికి ఆ పాత్ర కోసం ముందు మెగాస్టార్ చిరంజీవిని అనుకున్నాడట గుణ.

ఈ క్యారెక్టర్‌ను చిరుతో చేయించేందుకు సంప్రదింపులు కూడా జరిగినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరును అనుకున్నాక, ఆయనకు ఈ సినిమా కథను మూడు గంటల పాటు నరేట్ చేసినట్లు గుణశేఖర్ వెల్లడించాడు. చిరుకు ఈ కథ చాలా నచ్చిందని, ఐతే ఈ పాత్ర చేయాలా వద్దా అని నెల పాటు ఆయన ఆలోచించారని.. తర్వాత కెరీర్లో ఇప్పుడే స్పెషల్ అప్పీయిరెన్స్ క్యారెక్టర్లు చేయడం సరికాదేమో అని ఆ విషయాన్ని తనకు చెప్పాడని గుణ తెలిపాడు.

అయినా సరే.. చిరు ఈ పాత్ర చేస్తాడేమో అని తాను ఇంకో రెండు నెలలు ఎదురు చూసినట్లు ఆయన చెప్పాడు. చిరుతో కుదరకపోవడంతో తర్వాత గౌతమ్‌ మీనన్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్లు గుణ తెలిపాడు. మామూలుగా గౌతమ్ క్యామియో తరహా క్యారెక్టర్లే చేస్తుంటాడు కానీ.. ‘యుఫోరియా’లో మాత్రం ఆయనది ఫుల్ లెంగ్త్ రోలే. దాదాపు హీరోలా ఉంటుందీ క్యారెక్టర్. ఐతే ద్వితీయార్ధంలో ఆ పాత్రకు ప్రాధాన్యం తగ్గిపోవడం మైనస్ అయింది.

‘దృశ్యం-3’లో ప్రకాష్ రాజ్.. కానీ అది నిజం కాదు

ఒకప్పుడు తెలుగులో పది సినిమాలు రిలీజైతే అందులో ఐదారు సినిమాల్లో ప్రకాష్ రాజ్ కనిపించేవాడు. తమిళంలోనూ బ్రేక్ లేకుండా సినిమాలు చేశారాయన. కానీ తర్వాత ఆయన జోరు తగ్గింది. ఒక దశలో నటనకు దాదాపుగా దూరమైనట్లు కనిపించారు. రాజకీయాలు, ఇతర వ్యవహారాల మీద ఫోకస్ చేశారు. కానీ తర్వాత మళ్లీ ఆయన నటనను సీరియస్‌గా తీసుకుని వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

ఇటీవల ఆయన చేతికి క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్, సందీప్ రెడ్డిల కలయికలో రూపొందుతున్న ‘స్పిరిట్’లో కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ ‘దృశ్యం-3’లో ఆయన ఓ ముఖ్య పాత్రకు ఎంపికయ్యారు.

ఐతే ప్రకాష్ రాజ్ హిందీ ‘దృశ్యం-3’లో నటిస్తున్నారు అనగానే.. ఆయన ‘దృశ్యం’ ఫ్రాంఛైజీ తొలి రెండు చిత్రాల్లో నటించిన అక్షయ్ ఖన్నా స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. ‘దురంధర్’ తర్వాత బంపర్ క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ భారీగా పారితోషకం డిమాండ్ చేశాడని, అలాగే విగ్గుతోనే నటిస్తాడని స్పష్టం చేశాడని.. ఆ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా సరే.. దృశ్యం-3లో అక్షయ్ లేడన్నది వాస్తవం.

ఆ పాత్రనే ప్రకాష్ రాజ్‌తో భర్తీ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదని ప్రకాష్ రాజ్ తేల్చేశాడు. ‘‘దృశ్యం-3లో నేను నటిస్తున్నాను. నా పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైంది. మీ అందరికీ ఆ క్యారెక్టర్ నచ్చుతుందని ఆశిస్తున్నా. కానీ నేను ఎవరి స్థానాన్నీ భర్తీ చేయడం లేదు’’ అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు. ప్రకాష్ రాజ్.. అక్షయ్ పాత్రను రీప్లేస్ చేయడం లేదంటే, మరి ఆ క్యారెక్టర్ చేస్తున్నదెవరు.. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు? ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుండగా.. మలయాళ దృశ్యం-3 మాత్రం ఏప్రిల్ 2నే విడుదల కానుంది.

Tags:    

Similar News