హరీష్ శంకర్ వెనక్కి ఇచ్చేశాడు

Update: 2018-05-18 04:38 GMT
దువ్వాడ జగన్నాథమ్ డైరెక్టర్ సడెన్ గా హరీష్ శంకర్ ఇంకోసారి వార్తల్లోకి వచ్చాడు. ఈసారి సినిమాలకు సంబంధించి కాకుండా పొలిటికల్ పరంగా న్యూస్ లో కనిపించాడు. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. హరీష్ శంకర్ స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామంలో సొంత వ్యవసాయ భూమి ఉంది దాంతో అతడికి కూడా కొంత ప్రభుత్వ సాయం అందింది.

హరీష్ శంకర్ తనకు అందిన మొత్తాన్ని ఆ ఊరి పంచాయతీకే డొనేషన్ గా ఇచ్చేశాడు. సామాజిక బాధ్యతగా భావించి తాను ఈ మొత్తం ఊరికి తిరిగి ఇచ్చేశానంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ వెనక్కి ఇచ్చిన మొత్తం మరీ పెద్దదేమీ కాదు. దానికి ఎమ్మెల్యేను పిలిచి కాస్త హడావుడి చేసి మరీ తాను అందుకున్న మొత్తానికి సరిపడా చెక్ ను పంచాయతీకి ఇచ్చాడు. సినిమాల్లో పబ్లిసిటీ అలవాటవడంతో నిజజీవితంలోనూ చిన్న పనికి ఇంత హంగామా అవసరమా అనే మాట వినిపించింది. ఎందుకంటే ఇది సినిమా కాదు కదా.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ను వేద పండితుడిగా చూపిస్తూ హరీష్ శంకర్ తెరకెక్కించిన దువ్వాడ జగన్నాథమ్ అతడికి చేదు అనుభవమే మిగిల్చింది. సినిమాకు ముందు బోలెడంత బజ్ వచ్చినా రిలీజయ్యాక చూసిన వాళ్లంతా ఆ మూవీ అంత గొప్పగా లేదంటూ తేల్చేశారు. అప్పటి నుంచి మళ్లీ హిట్ కొట్టాలన్న పట్టుదలతో మెగా కాంపౌండ్ లోనే గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


Tags:    

Similar News