బండ్ల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన హరీష్ శంకర్...!

Update: 2020-05-12 16:15 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్'. సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడమంటే అంత సులభమైన పనికాదు. కథలో అసలు విషయం దారి తప్పకుండా తగ్గట్టు మన ప్రేక్షకులకు నచ్చేలా తీయాలి. అవసరమైతే మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలి. అయితే రీమేక్ ల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ ఇవన్నీ చేయగలిగాడు. 'గబ్బర్ సింగ్'ని ఇండస్ట్రీ హిట్ గా మలిచాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించాడు. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా 8 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌ లో ఈ సినిమాకి కష్టపడిన వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఓ లెటర్‌ ను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. ఈ స్టోరీ రాయడానికి సహాయపడిన రైటర్స్ సతీష్ వేగ్నేష్ - రమేష్ రెడ్డిలకు.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజశేఖర్ - విజయ్ - బాబీ లకు.. సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ - ఎడిటర్ గౌతమ్ రాజు - ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేసారు. 'గబ్బర్ సింగ్' చిత్రానికి సంబందించిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా ప్రస్తావించిన హరీష్ శంకర్.. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ని.. హీరోయిన్ శృతి హాసన్ ని విస్మరించాడు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమాని నిర్మించిన నిర్మాతని ఎలా మర్చిపోయాడు అంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. గబ్బర్ సింగ్ తర్వాత ఏమైనా మనస్పర్థలు వచ్చాయా.. అందుకే హరీష్ శంకర్ బండ్ల పేరును లైట్ తీసుకున్నాడా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేసారు. అయితే తన మిస్టేక్ తెలుసుకున్న హరీష్ శంకర్ తాజా ట్వీట్‌ ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

దేవిశ్రీ పెట్టిన ట్వీట్ కి రిప్లై గా హరీష్ శంకర్ స్పందిస్తూ.. తన మిస్టేక్‌ ను ఈ సందర్భంగా సరిచేసుకుంటున్నానని తెలుపుతూ బండ్ల గణేష్ గురించి ప్రస్తావించారు. ''మీ ప్రేమకు ధన్యవాదాలు. కానీ నేను ప్రొడ్యూసర్ పేరు మరిచిపోవడం నా మిస్టేక్. అందుకే ఈ ట్వీట్‌ లో నిర్మాత బండ్ల గణేష్‌ ను అభినందించేందుకు వాడుకుంటున్నాను. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకుండా గబ్బర్‌ సింగ్ చిత్రాన్ని నిర్మించిన మా బ్లాక్‌ బస్టర్ ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు..'' అని ట్వీట్ చేసారు హరీష్ శంకర్. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో చర్చకు తెరదించారు. అయితే ఈ ట్వీట్ లో కూడా హీరోయిన్ శృతి హాసన్ ని హరీష్ మరిచిపోవడం కొసమెరుపు. తన లెటర్ లో టెక్నిషియన్స్ ని హీరోని తప్ప మిగతా నటీనటులను మెన్షన్ చేయలేదు.. కాబట్టి హీరోయిన్ ని కూడా మెన్షన్ చేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News