'నా కథ వాళ్ళ దగ్గరే ఉంది'.. నెక్స్ట్ సినిమాపై రావిపూడి ఇలా!

ఆ ప్రాజెక్టులో నటించే హీరోయిన్స్, టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ప్రతి విషయం ఫిక్స్ అయ్యిందని వార్తలు వైరల్ అయ్యాయి.;

Update: 2026-02-13 03:54 GMT

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నెక్స్ట్ ప్రాజెక్టుపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ప్రేక్షకులకు కావలసిన అసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు.

డెబ్యూ మూవీ పటాస్ తో సూపర్ హిట్ అందుకున్న అనిల్.. ఆ తర్వాత నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గతేడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాంతో ఊహించని సక్సెస్ అందుకున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీరిద్దరి కాంబోలో సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వైరలవుతున్నాయి. అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా వెంకీతోనే చేయనున్నారని టాక్ వచ్చింది.

ఆ ప్రాజెక్టులో నటించే హీరోయిన్స్, టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ప్రతి విషయం ఫిక్స్ అయ్యిందని వార్తలు వైరల్ అయ్యాయి. వాటిపై ఇప్పటికే ఓ సారి రెస్పాండ్ అయిన అనిల్.. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మళ్లీ మాట్లాడారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ ఈవెంట్ రీసెంట్ గా జరగ్గా.. అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు.

ఆ సమయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, నెక్స్ట్ సినిమాపై ఒక్క అప్డేట్ ఇవ్వాలని రావిపూడిని సంతోష్ శోభన్ అడిగారు. అప్పుడు "నిజం చెబుతున్నా.. హానెస్ట్ గా చెబుతున్నా.. స్క్రిప్ట్ పై ఒట్టేసి చెబుతున్నా.. నా దగ్గర కంటే కొందరు ట్విట్టర్ ను శాసిస్తున్న జర్నలిస్ట్స్ దగ్గర, కొన్ని వెబ్ సైట్స్ దగ్గర నా కథ ఉంది. నేను కూడా చూస్తున్నాను. కాబట్టి మీ ఫోన్ ఓపెన్ చేసి వారిలో ఎవరికి ఫోన్ చేసినా మొత్తం డిటైల్స్ చెబుతారు" అని నవ్వుతూ అన్నారు.

దీంతో ఒక్కసారిగా ఈవెంట్ కు వచ్చిన వారంతా నవ్వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే ఇటీవల తాను కాగితం మీద కలం కూడా ఇంకా పెట్టలేదని, కానీ అప్పుడే క్యాస్టింగ్, స్టోరీ, టైటిల్‌ ను పెట్టేశారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ ఫ్లో చూస్తుంటే యాక్షన్‌ కట్ కూడా చెప్పేస్తారేమోనని హిలేరియస్ గా రెస్పాండ్ అయ్యారు.

Tags:    

Similar News