కంబ్యాక్ కోసం క్రిష్ భారీ ప్రయత్నాలు
‘గమ్యం’, ‘వేదం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలతో కథనంలో సార్వత్రికత, ఎమోషనల్ డెప్త్, సామాజిక అంశాలపై తన దృష్టిని చాటుకున్న క్రిష్.. ఒక దశలో కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు;
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుల్లో క్రిష్ జగర్లమూడి ఒకరు. ‘గమ్యం’, ‘వేదం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలతో కథనంలో సార్వత్రికత, ఎమోషనల్ డెప్త్, సామాజిక అంశాలపై తన దృష్టిని చాటుకున్న క్రిష్.. ఒక దశలో కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం.
ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిన ఘాటీ, వీరమల్లు
గతేడాది అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఘాటీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను తీయగా, భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కథలో ఉన్న డెప్త్ ఆడియన్స్ కు పూర్తిగా కనెక్ట్ కాలేదనే వాదనలు కూడా వ్యక్తమయ్యాయి. దానికి తోడు సగానికి పైగా క్రిష్ దర్శకత్వంలోనే తెరకెక్కిన హరి హర వీరమల్లు కూడా ఎన్నో ఇబ్బందుల తర్వత రిలీజై అనుకున్న ఫలితాన్ని అందుకోకపోవడంతో ఈ రెండు సినిమాల ఫలితాలతో క్రిష్ ప్రస్తుతం సరైన ఫామ్ లో లేకుండా పోయారు.
కంబ్యాక్ పై ఫోకస్
ఈ నేపథ్యంలోనే క్రిష్ తన కంబ్యాక్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. భారీ స్థాయిలో ఓ కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నక్రిష్, తన నెక్ట్స్ మూవీని మరింత స్పెషల్ గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ సరికొత్త ప్రయత్నం చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే క్రిష్ సినిమాలో నటించే ఆ ఏడుగురు భామలెవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ట్రెక్కింగ్ బ్యాక్ డ్రాప్ లో కథ
ప్రస్తుతం క్రిష్ హీరోయిన్ల ఎంపికలో బిజీగా ఉన్నారని, ఇప్పటికే కథను పూర్తి చేశారని తెలుస్తోంది. విభిన్న పాత్రలతో మహిళా పాత్రలకు ప్రాధాన్యమిస్తూ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, ఈ సినిమాను ట్రెక్కింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించనున్నారని సమాచారం. సహజ ప్రకృతి నేపథ్యంలో ఎమోషన్స్, వ్యక్తిగత ప్రయాణాలు, మానసిక సంఘర్షణలు కలిపిన కథనంతో కొత్త తరహా స్క్రీన్ ప్లే ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి అందరి మెప్పును పొందాలని క్రిష్ ప్రయత్నాలు చేస్తున్నారట. క్రిష గత సినిమాల కంటే ఈ సినిమా కథ, ట్రీట్‌మెంట్ చాలా భిన్నంగా ఉండబోతున్నాయని అతని సన్నిహిత వర్గాలంటున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. మరి వరుస నిరాశల తర్వాత క్రిష్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.