పుష్క‌రాల్లో పులి క‌ళ్ల పిల్ల‌.. నాడు మోనాలిసా.. నేడు ప‌ప్పు దేవి!

గత 20 ఏళ్లుగా ఫోటోగ్రఫీ ప్రపంచంలో ఒక మిస్టరీగా మిగిలిపోయిన ఆ `పులి కళ్ల` పిల్ల ఎవ‌రో ఆచూకీ దొరకడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.;

Update: 2026-02-13 03:52 GMT

గత 20 ఏళ్లుగా ఫోటోగ్రఫీ ప్రపంచంలో ఒక మిస్టరీగా మిగిలిపోయిన ఆ `పులి కళ్ల` పిల్ల ఎవ‌రో ఆచూకీ దొరకడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఆమే `పప్పు దేవి`. ప్ర‌యాగ్ రాజ్ మ‌హా కుంభ‌మేళాలో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన మోనాలిసా భోంస్లే కంటే ద‌శాబ్ధాల ముందే ఈ ప‌ల్లెటూరి పులి క‌ళ్ల పిల్ల సంచ‌ల‌నం సృష్టించింది. అస‌లు ఆమె ఫోటో ఎలా బ‌య‌టి ప్ర‌పంచంలోకి వెళ్లింది? అంటే...

2005లో రాజస్థాన్‌లోని పాపుల‌ర్ `పుష్కర్ మేళా`లో ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ ఒక గ్రామీణ మహిళను ఫోటో తీశారు. ఆ ఫోటోలో ఆమె కళ్లు ఎంత తీక్షణంగా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయంటే.. అప్పట్లో ఆ ఫోటో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. నేషనల్ జియోగ్రాఫిక్ `ఆఫ్ఘన్ గర్ల్` ఫోటోతో దీన్ని పోల్చారు. కానీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? ఆమె ఎక్కడుంది? అన్నది ఎవరికీ తెలియదు.

క‌ట్ చేస్తే రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత‌... ప్రముఖ ట్రావెల్ డాక్యుమెంటరీ మేకర్, ఫోటోగ్రాఫర్ అనురాగ్ తల్వార్ ఇటీవల ఆమెను వెతుకుతూ పుష్కర్ వెళ్లారు. చాలా ప్రయత్నాల తర్వాత పుష్కర్‌కు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఆమెను కనుగొన్నారు. ఆమె ప్ర‌స్తుత పరిస్థితి ఏమిటి? అని ఆరా తీస్తే, అప్పుడు యవ్వనంలో ఉన్న ఆ మహిళ ఇప్పుడు మధ్యవయస్కురాలైంది. త‌న‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

తన 20 ఏళ్ల క్రితం నాటి ఫోటోను చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఎవరో ఫోటో తీశారని గుర్తుంది కానీ అది ఇంత పాపులర్ అయిందని ఆమెకు తెలియదు. అనురాగ్ తల్వార్ ఆమెను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెటిజన్లు ``సమయం మనిషిని మార్చినా, ఆ కళ్లలోని మెరుపు మాత్రం అలాగే ఉంది`` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పప్పు దేవి కథ ఒక అద్భుతమైన అన్వేషణ- జీవ‌న విధానంతో ముడిప‌డిన‌ది. ఒక ఫోటో మనిషిని దశాబ్దాల పాటు ప్రపంచానికి గుర్తిండిపోయేలా చేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. రాజస్థాన్ సంస్కృతిని.. అక్కడి ప్రజల సహజ సిద్ధమైన అందాన్ని ప్రతిబింబించేలా నాటి ఫోటోగ్ర‌ఫీ కూడా గొప్ప గౌర‌వాన్ని అందుకుంది. మోనాలిసా.. ప‌ప్పు దేవి.. ఇంకా చాలా మంది ఈ స‌మాజంలో హిడెన్ జెమ్స్ ఉన్నారు. వారి అద్భుత‌మైన సౌంద‌ర్యంతో ఆక‌ట్టుకున్నా బ‌య‌టి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయ్యేది చాలా త‌క్కువ‌.

Tags:    

Similar News