బర్త్ డే స్పెషల్: వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన విలక్షణ దర్శకుడు..!

Update: 2020-11-10 08:10 GMT
క్రిష్ జాగర్లమూడి.. 'గమ్యం' సినిమాతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్గాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న క్రిష్.. విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు కూడా అందుకున్నాడు. అల్లరి నరేష్ - శర్వానంద్ - కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా వారి కెరీర్లోనే మరపురాని చిత్రంగా మిగిలింది. 'గమ్యం' తర్వాత అల్లు అర్జున్ - మంచు విష్ణు - అనుష్క లను ప్రధాన పాత్రల్లో తీసుకుని 'వేదం' అనే విభిన్న తరహా చిత్రాన్ని తెరకెక్కించారు క్రిష్. ఇది కూడా మంచి సినిమా అనిపించుకుని ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది. ఇదే క్రమంలో దగ్గుబాటి రానా - నయనతార లతో తీసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

'గబ్బర్' సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు క్రిష్. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా 'ఠాగూర్' సినిమాకి రీమేక్. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ తో తీసిన పీరియాడికల్ లవ్ స్టోరీ 'కంచె' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తో తెలుగుజాతి కీర్తిని చాటిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' బయోపిక్ ని తెరకెక్కించారు. ఈ సినిమాతో లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటీ అవుట్ తీసుకొస్తాడనే పేరు తెచ్చుకున్న క్రిష్.. స్టార్ డైరెక్టర్స్ సరసన చేరాడు. క్రిష్ వర్కింగ్ స్టైల్ నచ్చిన బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే బాధ్యత అప్పగించాడు. 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

తెలుగులో సక్సెస్ అయిన 'వేదం' సినిమాని తమిళ్ లో 'వానం' పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా విజయాన్ని దక్కించుకున్నాడు. అలానే ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్ 'మణికర్ణిక' ను కంగనా రనౌత్ తో కలిసి రూపొందించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కమర్షియల్ సినిమాలకు తనదైన శైలిలో సమాజానికి ఉపయోగపడే విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. పీరియాడికల్ మూవీగా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తీయడానికి సన్నాహకాలు చేసుకున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది.

అయితే ఈ గ్యాప్ లో కేవలం 45 రోజుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో ఓ సినిమా పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇలా వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నేడు(నవంబర్ 10) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన మరెన్నో విజయాలు అందుకుని సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' క్రిష్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.
Tags:    

Similar News