పుకార్లపై స్పందించిన గుణటీం వర్క్స్‌

Update: 2020-10-05 10:10 GMT
టాలీవుడ్‌ ప్రేక్షకులకు భారీ సెట్టింగ్‌ లు పరిచయం చేసిన దర్శకుడు గుణశేఖర్‌. ఆయన ఒక్కడు సినిమా కోసం ఛార్మినార్‌ పాతబస్తీ సెట్టింగ్స్‌ నిర్మించడంతో పాటు అర్జున్‌ సినిమా కోసం మధుర మీనాక్షి సెట్టింగ్‌ ను వేయించాడు. అంతకు ముందు ఆయన చేసిన సినిమాల్లో కూడా భారీ సెట్టింగ్స్‌ వేయించాడు. కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ లను అందుకున్న గుణశేఖర్‌ చివరగా రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా వచ్చి అయిదు ఏళ్లు పూర్తి అయ్యింది. అయినా ఇప్పటి వరకు ఆయన తదుపరి సినిమాను మొదలు పెట్టలేదు. ఇటీవల ఆయన నెట్‌ ఫ్లిక్స్‌ కోసం ఒక వెబ్‌ సిరీస్‌ ను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

షూటింగ్‌ మొదలు పెట్టబోతున్న సమయంలో స్క్రిప్ట్‌ నచ్చలేదని గుణశేఖర్‌ కు వారు హ్యాండ్‌ ఇచ్చారని.. బడ్జెట్‌ విషయంలో నెట్‌ ఫ్లిక్స్‌ వారు వెనక్కు తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో గుణశేఖర్‌ టీం అధికారికంగా స్పందించింది. అసలు ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ తో గుణశేఖర్‌ చర్చలు జరిపిందే లేదు. ఆయనకు ఓటీటీపై ఆసక్తే లేదు అంటూ తెలియజేశారు. మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరు నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే గుణశేఖర్‌ తాను చేయబోతున్న సినిమా వివరాలను అధికారికంగా ప్రకటిస్తాడంటూ గుణ టీమ్‌ వర్క్స్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొనడం జరిగింది.
Tags:    

Similar News