యంగ్ హీరో రియాల్టీ బయట పెట్టే ప్లాన్ లో!
తిమ్మరాజుపల్లి టీవీ అనే చిత్రంతో ఆయన నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.;
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాక రైటింగ్ లోన కొంత అనుభవం ఉండటంతో తనని తాను హీరోగా మలుచుకోవడం సులభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అడుగు ముందుకు వేసి రియాల్టీ అనే చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కేవలం దర్శకత్వానికే పరిమితం అవుతాడా లేక ఆయనే స్వయంగా హీరోగా నటిస్తాడా? అనే దానిపై చర్చ జరుగుతోంది. రియాల్టీ అనే టైటిల్ కథాంశం ప్రకారం ఒక కొత్త హీరోని పరిచయం చేసే అవకాశం ఉందని లేదా కథ డిమాండ్ చేస్తే కిరణ్ స్వయంగా రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది. దర్శకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు నటనపై దృష్టి పెట్టడం కష్టమని భావిస్తే? బయట హీరోని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది.
నిర్మాణ రంగంలో కూడా కిరణ్ అబ్బవరం ఇప్పటికే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
తిమ్మరాజుపల్లి టీవీ అనే చిత్రంతో ఆయన నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రియాల్టీ చిత్రాన్ని కూడా తన సొంత బ్యానర్‌లోనే నిర్మించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. నటుడిగా రాణిస్తోన్న కిరణ్ ఇప్పుడు దర్శకుడిగా కూడా సక్సెస్ అయితే టాలీవుడ్‌లో ఒక కంప్లీట్ ఫిలిం మేకర్ గా గుర్తింపు పొందుతాడు. రియాల్టీ చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి రాబోయే దీపావళి పండుగ కానుకగా విడుదల చేయాలని కిరణ్ ప్లాన్ చేస్తున్నాడు. దీపావళి సీజన్ బాక్సాఫీస్ వద్ద సినిమాలకు మంచి ఊపునిస్తుంది కాబట్టి ఆ సమయానికి సినిమాను సిద్ధం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందని సమాచారం. హీరోలు దర్శకులుగా మారడం అనేది పెద్ద సాహసమే. అయితే కిరణ్ అబ్బవరంకు మొదటి నుండి సినిమా మేకింగ్ మీద అవగాహన ఉంది. ఆయన తన కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉండటం వల్ల వెండితెరపై దర్శకుడిగా తన మార్కును సులభంగానే చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రియాల్టీ అనే పేరు చూస్తుంటే? ఇది వాస్తవిక సంఘటనల ఆధారంగా లేదా నేటి సమాజంలోని పరిస్థితులపై సెటైరికల్‌గా సాగే కథ అయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం ఒకేసారి నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు తీసుకోవడం ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపు కానుంది. తిమ్మరాజుపల్లి టీవీ విడుదల తర్వాత `రియాల్టీ`పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన ప్రతిభతో వరుసగా కొత్త ప్రయోగాలు చేస్తోన్న యంగ్ హీరో దర్శకుడిగా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని ఆశీద్దాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడనున్నాయి.