ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్య‌లు

హైదరాబాద్‌తో సమానమైన వినోద పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమా? అంటే.. దానికి ఆయన అత్యంత ధీమాగా సమాధానమిచ్చారు.;

Update: 2026-04-12 08:36 GMT

ముక్కు సూటిగా ఉన్నది ఉన్న‌ట్టుగా మాట్లాడేవాళ్లు చాలా అరుదు. టాలీవుడ్ వెట‌ర‌న్ ద‌ర్శ‌క‌నిర్మాత‌, దాస‌రి శిష్యుడు అయిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కూడా ముక్కుసూటిగా మాట్లాడే కొంద‌రిలో ఒక‌రు. ఆయ‌న ఇప్పుడు ఆ 20 మంది నిర్మాత‌లు లేదా ఆ న‌లుగురిని వ్యాపారులు అని కామెంట్ చేసారు. ఆయ‌న‌ తనదైన ముక్కుసూటి శైలిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు హా*ట్ టాపిగ్గా మారాయి. నిజాయితీగా ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏపీలో కేవ‌లం రెండు మూడేళ్ల‌లోనే హైద‌రాబాద్ సినీప‌రిశ్ర‌మ‌కు ధీటైన ప‌రిశ్ర‌మ‌ను నెలకొల్ప‌గ‌ల‌మ‌ని త‌మ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న కొందరు ప్రభావవంతమైన నిర్మాతల గురించి తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో కేవలం 20 మంది నిర్మాతలు లేదా `ఆ నలుగురు` మాత్రమే సర్వస్వం కాదని.. వారు కేవలం వ్యాపారస్తులని ఆయన పేర్కొన్నారు. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఆ న‌లుగురినే ప‌రిశ్ర‌మ అనుకుంటోంద‌ని ఇత‌రులు అలా అనుకోవ‌డం లేద‌ని త‌మ్మారెడ్డి అన్నారు. ఏటా సుమారు 200 సినిమాలు వస్తుంటే.. అందులో కేవలం 20 సినిమాలే పెద్ద నిర్మాతలవి ఉంటాయని.. మిగిలిన 180 మంది చిన్న నిర్మాతలు కూడా ఇక్క‌డే ప‌ని చేస్తున్నారని, వారి క్షేమం గురించి ఆలోచించడమే అసలైన పరిశ్రమ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. కేవలం వ్యాపార కోణంలో ఆలోచించే వారు మాత్ర‌మే పరిశ్రమ కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఆ 20 మందిలో న‌లుగురే సినిమాలు తీసి మాట్లాడుతున్నార‌ని అన్నారు. సినిమాల కోసం ఆస్తులు అమ్ముకునే నిర్మాత‌లు చాలామంది ఉన్నార‌ని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌తో సమానమైన వినోద పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమా? అంటే.. దానికి ఆయన అత్యంత ధీమాగా సమాధానమిచ్చారు. ఏపీలో హైదరాబాద్‌కు దీటుగా పరిశ్రమ ఏర్పడకపోతే తనను అడగాలని సవాల్ విసిరారు. వైజాగ్‌లో ఇప్పటికే స్టూడియోలు ఉన్నాయని.. అక్కడ రికార్డింగ్ సౌకర్యాలు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే... షూటింగ్స్ కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. మ‌ధ్య ప్ర‌దేశ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో షూటింగులు చేస్తున్నామంటే దానికి కార‌ణం స‌బ్సిడీలు ఇస్తున్నారు గ‌నుక‌నే. ఒక‌వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వాలు స‌బ్సిడీలు ఇస్తే ఇక్క‌డే అన్ని ప‌రిశ్ర‌మ సినిమాల షూటింగులు జ‌రుగుతాయి. ఒడియా, భోజ్ పురి స‌హా అన్ని సినిమాల షూటింగుల కోసం ఇక్క‌డికే వ‌స్తారు.. అని త‌మ్మారెడ్డి అన్నారు.

నిజానికి ముంబై నుంచి వైజాగ్ లోని రికార్డింగ్ స్టూడియోల‌లో ప‌నుల కోసం వ‌స్తుంటే.. మేం హైద‌రాబాద్ నుంచి విదేశాల‌కు వెళుతున్నామ‌ని త‌మ్మారెడ్డి త‌న‌దైన శైలిలో సెటైర్ వేసారు. వైజాగ్‌లోని ఫిలిం స్టూడియోలలో రికార్డింగ్ థియేటర్లు.. ఇతర సాంకేతిక వసతులు మెరుగుపడాలని ఆయన సూచించారు. నిర్మాతలు, దర్శకులు షూటింగ్ చేసిన చోటే అన్ని పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగితే.. ఆంధ్రప్రదేశ్ సినిమా నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా మారుతుందని భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేశారు.

చిన్న నిర్మాతలను కాపాడుకుంటేనే పరిశ్రమ మనుగడ సాధ్యమని తమ్మారెడ్డి ఎల్ల‌పుడూ నమ్ముతారు. పెద్ద నిర్మాతలు తమ సినిమాల బిజినెస్ గురించి మాత్రమే ఆలోచిస్తారని.. కానీ వ్యవస్థ బాగుండాలంటే ప‌రిశ్ర‌మ మొత్తంలో ఉన్న 180 మంది నిర్మాతల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News