వైరల్ సింపతీ వీడియో.. తిరువీర్ ఏమన్నారంటే?

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరువీర్ క్లారిటీ ఇచ్చారు. "నేను చెప్పిన మాటలు ఎలా కమ్యూనికేట్ అయ్యాయో తెలియదు.;

Update: 2026-04-12 06:45 GMT

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ముందుకు రాబోతున్నారు. మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ వంటి సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు పాపం ప్రతాప్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆ మూవీ ట్రైలర్‌ ను తాజాగా విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోంది.

అయితే ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌ లో తిరువీర్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. విజయవాడకు ఫ్లైట్‌ లో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చున్న వ్యక్తి తనను గుర్తించలేదని ఆయన తెలిపారు. ఫోన్‌ లో మాట్లాడుతుండగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారా అని అడిగారని, తాను ఓజీకి అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పినా పెద్దగా స్పందన రాలేదని చెప్పారు.

మరో సందర్భంలో తన మూవీ షూటింగ్ లొకేషన్‌ లోనే హీరో ఎవరని అడిగారని, తానే అక్కడ ఉండగా అలా అడగడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎదురవుతుంటాయని అన్నారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోకు సాడ్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ జోడించడంతో, కొంతమంది ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరువీర్ క్లారిటీ ఇచ్చారు. "నేను చెప్పిన మాటలు ఎలా కమ్యూనికేట్ అయ్యాయో తెలియదు. ఆ సమయంలో నేను చాలా క్యాజువల్‌ గా మాట్లాడాను. టైర్డ్ గా ఉన్నా అప్పుడు. కానీ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా అది మరోలా కనిపించింది" అని ఆయన వివరించారు. తనను గుర్తించకపోవడంపై ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశారు.

"నన్ను నటుడిగా గుర్తించాల్సింది నాకు అవకాశాలు ఇచ్చే దర్శకులు, నిర్మాతలు. వాళ్లందరికీ నేను బాగా తెలుసు. ఒక సమయంలో రోజుకు మూడు నాలుగు కథలు విన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ రోజుకు కనీసం ఒక నెరేషన్ వింటున్నాను" అని చెప్పారు. సాధారణ ప్రేక్షకులు తనను గుర్తించడానికి కొంత సమయం పట్టవచ్చని, అది సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. "నేను సినిమాల్లో కనిపించేలా బయట ఉండను. అందుకే చాలా మంది పోల్చలేకపోతారు. కొన్ని సందర్భాల్లో దర్శకులే కూడా గుర్తించని పరిస్థితులు వచ్చాయి. నేను నటించిన సినిమాల గురించి నేనే చెప్పిన సందర్భాలూ ఉన్నాయి" అని తెలిపారు.

అయినా కూడా పరిస్థితులు ఎంజాయ్ చేస్తున్నానని తిరువీర్ చెప్పారు. "ఇలా ఉండటం వల్ల ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగగలను. షాపింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా జీవించగలను. అందుకే నేను ఎలాంటి బాధపడటం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను" అని స్పష్టం చేశారు. మొత్తానికి తన వైరల్ సింపతీ వీడియోకు సంబంధించిన అసలు విషయాన్ని వివరిస్తూ తిరువీర్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News