బాలయ్య - క్రిష్ కాంబోలో మరో మూవీ.. ఈసారి రిజల్ట్ సంగతేంటి?

ఇకపోతే బాలయ్య సినిమా మాత్రమే కాకుండా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.;

Update: 2026-04-12 08:29 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ జోరు పెంచిన విషయం తెలిసిందే.. ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా తనకు సక్సెస్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా..సరే కొంతమంది దర్శకులకు పదేపదే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఏకంగా నాలుగు చిత్రాలు చేసిన బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గతంలో వీర సింహారెడ్డి సినిమా చేసి ఇప్పుడు మరో కొత్త మూవీకి శ్రీకారం చుట్టారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగానే మరొకవైపు మరోసారి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మూడోసారి నటించడానికి సిద్ధమైపోయారు బాలయ్య.

ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య మూడవసారి సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది.అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ క్రిష్ ఎంచుకున్న కాన్సెప్ట్ కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు డిజాస్టర్ గా నిలిచినా క్రిష్ వర్క్ పై బాలయ్యకు పూర్తి నమ్మకం ఉందట. అందుకే ఆయనతో మళ్ళీ మూడోసారి సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు బాలయ్య. సాధారణంగా వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. అందుకే అటు బాలయ్య కూడా క్రిష్ మీద నమ్మకంతో ఇప్పటికే కథను ఫైనల్ చేశారని సమాచారం.

ఇకపోతే బాలయ్య సినిమా మాత్రమే కాకుండా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలను బట్టి చూస్తే ఒకేసారి అటు తండ్రిని ఇటు కొడుకుని క్రిష్ హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట.ఇప్పటికే రెండుసార్లు ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . కానీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ముచ్చటగా మూడోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ కాంబో కనీసం ఈసారైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు . మరి ఈ కాంబో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మంచి కంటెంట్ అందించి సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం..

ఇకపోతే బాలయ్య తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఒకవైపు గోపీచంద్ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరొకవైపు తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు బాలయ్య.. అందులో భాగంగానే వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారు.. ఇప్పటికే బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా చేయబోతున్నారు అనగానే అభిమానులలో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య మాస్ యాంగిల్ ను చూపిస్తూనే వివేక్ తనదైన స్టైల్ మేకింగ్ తో ఈ సినిమాను చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఏది ఏమైనా బాలయ్య ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు అంటూ మరింత బిజీగా మారిపోయారు.

Tags:    

Similar News