యాక్టివ్ గిల్డ్ జూమ్ కి మ‌హ‌మ్మారీ చెక్

Update: 2020-06-24 04:15 GMT
ప‌రిశ్ర‌మ‌ను దారికి తెచ్చి అదుపాజ్ఞ‌ల్లో ఉంచుకోవ‌డం లాంటి దీర్ఘ కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళుతోంది యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్. ఇండ‌స్ట్రీలో షూటింగులు ప్రారంభం అవ్వాల‌న్నా.. రిలీజ్ కి వ‌చ్చే సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వాల‌న్నా.. ఫైనాన్సులు అందాల‌న్నా గిల్డ్ వాళ్ల ఆజ్ఞ లేనిదే ఇక‌పై జ‌ర‌గ‌ని ప‌ని. మీడియాని సైతం అదుపాజ్ఞ‌ల్లోకి తెచ్చే ప్ర‌ణాళిక‌ను వేగవంతం చేసింద‌న్న గుస‌గుస ఇప్ప‌టికే వేడెక్కించింది.

మ‌హ‌మ్మారీ క్రైసిస్ కాలంలో గిల్డ్ యాక్టివిటీ మ‌రింత పెరిగింది. ఇక‌పై ఇండ‌స్ట్రీ లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌మ‌నే సంప్ర‌దించేలా నిర్మాత‌ల మండ‌లిని డ‌మ్మీని చేసే ఎత్తుగ‌డ‌తో ముందుకెళుతోందిట‌. ఇందుకోసం 21 మంది స‌భ్యుల కోర్ క‌మిటీ కృషి చేస్తోంద‌ని తెలుస్తోంది. సినిమాల రిలీజ్ లు స‌హా సినిమాల కాస్ట్ కంట్రోల్.. వాణిజ్య ప్రక‌ట‌న‌ల ఒప్పందాలు.. హీరోలు టెక్నీషియ‌న్ల‌ పారితోషికాల కుదింపు ఇత‌ర‌త్రా విష‌యాల‌పైనా ఈ కోర్ క‌మిటీనే  జూమ్ స‌మావేశాల‌తో హ‌డావుడి చేస్తోంద‌ట‌. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యం లో షూటింగుల ప‌రిస్థితుల్ని రివ్యూ చేస్తూ.. తాజాగా మ‌రో సారి స‌మావేశం జ‌రిపార‌ని తెలుస్తోంది.

అయితే యాక్టివ్ గిల్డ్ ఎంత జూమ్ చేసినా ఏం ఉప‌యోగం?  వీళ్లెవ‌రూ క‌రోనాని ఆప‌లేరు. తెలంగాణ‌-ఆంధ్రాలో అంత‌కంత‌కు క‌రోనా  కేసులు పెరుగుతున్నాయే కానీ త‌గ్గ‌డం లేదు. ఒక ర‌కంగా లాక్ డౌన్ త‌ర్వాత మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి నెల‌కొంది. సింగిల్ డిజిట్ కాస్తా డ‌బుల్ ట్రిపుల్ అయ్యింది. పాజిటివ్ కేసులు నాలుగంకెల‌కు చేరుకునే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. రోజుకు 800-900 కేసులు న‌మోద‌వుతున్నాయంటే .. మునుముందు ఈ సంఖ్య రోజువారీగా 10వేల మార్కుకు చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగులు ప్రారంభ‌మైతే మ‌రింత ప్ర‌మాదం అని అంచ‌నా.

ఇటీవ‌ల టీవీ సీరియ‌ల్ న‌టులు.. యాంక‌ర్లకు క‌రోనా అంటూ సాగిన ప్ర‌చారం తో ఒక్క‌ సారిగా ఇండ‌స్ట్రీ లో ఒక్క‌ సారిగా కంగారు పుట్టింది. ఇక‌పై సినిమాల షూటింగులు మొద‌లైతే అక్క‌డ స‌న్నివేశ‌మేమిటో అర్థం కాని ప‌రిస్థితి. క‌రోనా అంద‌రి జూమ్ కి చెక్ పెట్టేస్తోంది. హీరోలు ఆర్టిస్టుల‌కు ఖంగు తినిపించింది. గిల్డ్ వాళ్ల‌కు మ‌హ‌మ్మారీ చెక్ త‌ప్ప‌డం లేదు మ‌రి.
Tags:    

Similar News