షాకింగ్ లుక్: ఉస్తాద్ PSPK కాలేజ్ బుల్లోడిలా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గ్రేస్ స్టైల్‌తో మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన `ఉస్తాద్ భగత్ సింగ్` సరికొత్త పోస్టర్‌లో పవన్ లుక్ చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గ్రేస్ స్టైల్‌తో మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన `ఉస్తాద్ భగత్ సింగ్` సరికొత్త పోస్టర్‌లో పవన్ లుక్ చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పాతికేళ్ల నవ యువకుడిలా, ఒక కాలేజీ బుల్లోడిలా మెరిసిపోతున్నారు. గెడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో ఉన్న ఈ లుక్.. మళ్లీ తమ్ముడు, బద్రి రోజుల్లోకి తీసుకెళ్లింది. పవన్ ముఖకవళికల్లో ఉన్న ఆ దుడుకుతనం, బాడీ లాంగ్వేజ్ ఒక యువకుడి ఆవేశాన్ని తలపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ తన లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.. అందుకే ఆయన వయసు మళ్ళీ పాతికేళ్ల వెనక్కి వెళ్ళిందా అన్నట్లుగా కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ తో సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. `పాతిక రోజుల్లోనే బాక్సాఫీస్ పెద్ద పండగ` అంటూ మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. పోస్టర్‌పై ఉన్న అంకె చూడగానే పవన్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. పవన్ మార్క్ మాస్ ఎంటర్‌టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది స్పెషల్ ట్రీట్ కానుంది. పవన్ ఈ చిత్రంలో మునుపటి కంటే మరింత ఎనర్జిటిక్ గా యంగ్ లుక్‌తో కనిపించబోతున్నారని ఈ స్టిల్ స్పష్టం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ తేదీ ప్రకటనతో సోషల్ మీడియాలో `ఉస్తాద్` హవా మొదలైంది. మార్చి 26 కోసం పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు ప్లాన్ చేసుకుంటున్నారు. పోస్టర్‌లో పవన్ కూర్చున్న తీరు.. ఆ స్వాగ్ చూస్తుంటే థియేటర్లలో విజిళ్లు, గోల గ్యారెంటీ అని అర్థమవుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పవన్ అభిమానులకు ఒక ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇవ్వబోతోంది. సినిమా ఆసాంతం పవన్ కళ్యాణ్ ఫుల్ స్వాగ్ మోడ్‌లో కనిపించబోతున్నారని, ఇది థియేటర్లలో ఒక రకమైన విస్ఫోటనాన్ని సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ అయనక బోస్ బాధ్యతలు చేపట్టారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆశుతోష్ రాణా, గౌతమి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మొత్తానికి `ఉస్తాద్ భగత్ సింగ్` మార్చి 26న థియేటర్లలోకి రావడం ఖాయమని అధికారికంగా ఖరారయ్యింది. కేవలం 25 రోజులే సమయం ఉండటంతో ఇకపై వరుస అప్‌డేట్స్‌తో ప్రమోషన్స్ హోరెత్తనున్నాయి. పవన్ కళ్యాణ్ తన స్టైలిష్, మాస్ అవతారంతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.