బన్నీ పక్కన హీరోయిన్ అంటూ గీతా ఆర్ట్స్ పేరును వాడేస్తున్నారట!!

Update: 2020-07-10 04:45 GMT
సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ మోసం చేయటం తెలిసిందే. ఇలాంటివి ఇప్పటికే చాలానే విన్నాం. ఈ మోసానికి ఇప్పుడో ప్రముఖ సంస్థ పేరును వాడుకోవటం కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో టాప్ బ్యానర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ పేరును దెబ్బ తీసేలా  జరుగుతున్న మోసాలపై సదరు సంస్థకు అందిన సమాచారం వారిని ఆందోళనకు గురి చేసింది.

వెంటనే స్పందించిన గీతా ఆర్ట్స్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.  తమ బ్యానర్ పేరును వాడుకుంటూ.. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటూ మోసం చేస్తున్నారంటూ గీతా ఆర్ట్స్  పేర్కొంది. కొందరు మోసగాళ్లు తమ బ్యానర్ పేరును  తప్పుగా  వాడేస్తున్న వైనాన్ని పోలీసులకు వెల్లడించారు. సదరు మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

గీతా ఆర్ట్స్ నిర్మించే తాజా చిత్రంలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా చేయటం కోసం కొత్త అమ్మాయిల్ని వెతుకుతున్నారంటూ ట్రాప్ చేస్తున్నట్లు సదరు సంస్థకు చెందిన సత్య అనే మేనేజర్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు గీతా ఆర్ట్స్ లో డిజైనర్ అని.. మేకప్ మెన్ అని చెబుతూ పలువురు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్న వైనం తమ వరకు వచ్చినట్లు గీతాఆర్ట్స్ పేర్కొంది.

ఇలా తమ పేరును తప్పుగా వాడుకుంటూ అమ్మాయిల్ని మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు షురూ చేశారు. నిందితుల్ని పట్టుకోవటమే మిగిలింది.
Tags:    

Similar News