కెరీర్ 25వ సినిమా హీరోల‌కు గేమ్ ఛేంజ‌ర్?

Update: 2021-06-03 02:30 GMT
25 .. 50.. 100  ఈ నంబ‌ర్లు కొంద‌రికి లైఫ్ లో గేమ్ ఛేంజ‌ర్ ఫిగ‌ర్స్.  హీరోల విషయానికి వస్తే 25 లేదా 50 వ చిత్రం  మైలురాయి లాంటిది. టాలీవుడ్ క్లాసిక్ హీరోలు మొద‌లు నేటిత‌రం హీరోల వ‌ర‌కూ 25వ సినిమాని మైలురాయిగా భావించి దానికోసం చాలా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసుకున్న సంద‌ర్భాల్ని గుర్తు చేసుకుంటే.. గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

విశ్వ విఖ్యాత‌ న‌ట‌సార్వ‌భౌమ.. టాలీవుడ్ తొలి త‌రం స్టార్ హీరో నందమూరి తారక రామారావు కెరీర్ 25వ చిత్రం `ఇద్ద‌రు పెళ్లాలు`. ఎఫ్.నాగూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఎన్టీఆర్ కి బిగ్ బ్రేకింగ్ పాయింట్. ఆ త‌ర్వాత ఆయ‌న అసాధార‌ణ విజ‌యాల్ని అందుకున్నారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ 25వ చిత్రం - `బ్రతుకు తరువు`. కోవెలముడి భాస్కర్ రావు నిర్మించిన‌ ఈ మూవీ లో సావిత్రి  హీరోయిన్. పి.ఎస్. రామకృష్ణారావు ఈ ల్యాండ్ మార్క్ మూవీకి దర్శ‌క‌త్వం వ‌హించారు. ఘట్టమనేని కృష్ణ కెరీర్ 25వ సినిమా - బొమ్మలు చెప్పినా కథ. జి. విశ్వనాథం తెర‌కెక్కించారు. చాల తక్కువా సమయం లో 25 సినిమాల మైలురాయిని అందుకున్న గ్రేట్ హీరోగా కృష్ణ పేరు మార్మోగింది. నాటిత‌రం క్లాసిక్ హీరోల 25వ సినిమాల‌న్నీ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో చిరంజీవి టైమ్ స్టార్ట‌య్యింది. `న్యాయం కావాలి` .. చిరంజీవి కెరీర్ 25వ సినిమా. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. చిరుకి కెరీర్ ప‌రంగా బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. చిరు-కోదండ‌రామిరెడ్డి తొలి క‌ల‌యిక‌లో 5 లక్షల బడ్జెట్ తో తెర‌కెక్కి 100 రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ కి  చిరు 10 వేల‌ రూపాయల వేతనం తీసుకున్నారు. నిప్పులాంటి మనిషి - బాల‌కృష్ణ కెరీర్ 25వ సినిమా. ఎస్. బి. చక్రవర్తి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర హిందీ లో చేసిన 'ఖయామత్' సినిమా కి తెలుగు రీమేక్ ఇది. ఈ మూవీ లో రాధ హీరోయిన్. బాక్సాఫీస్ వ‌ద్ద‌ యావరేజ్ గా ఆడింది.

నాగార్జున న‌టించిన 25వ మూవీ `జైత్ర యాత్ర`. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వ‌హించారు. తనికెళ్ల‌ భరణి కథ అందించ‌గా.. ఈ మూవీ లో నాగ్ న‌ట‌న‌కు విమర్శకులు ప్రేక్షకులతో పాటు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. వెంకటేష్ న‌టించిన 25వ సినిమా- కొండపల్లి రాజా. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. రజనీకాంత్ తమిళ చిత్రం 'అన్నామలై'కి తెలుగు రీమేక్ ఇది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ సూపర్ హిట్ గా నిలిచింది.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అజ్ఞాత‌వాసి. ప‌వ‌న్  25వ చిత్రంగా వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. పంపిణీదారుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసిన చిత్ర‌మిది. మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన 25వ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించినా కానీ క్రిటిక్స్ మెప్పు పొంద‌లేక‌పోయింది.

సుకుమార్ - తారక్ కాంబినేషన్ లో వచ్చిన నాన్న‌కు ప్రేమ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ లో విల‌క్ష‌ణ న‌టుడిని బ‌య‌టికి తెచ్చిన 25వ‌ చిత్ర‌మిది. మాస్ మహారాజా ర‌వితేజ‌ -సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన  కిక్ మూవీ రవితేజ కి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రిలీజై బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

కెరీర్ ప్రారంభంలో విలన్ గా క్లిక్ అయ్యి ఆ తరువాత హీరోగా సెటిల్ అయిన హీరో గోపిచంద్. కొత్త దర్శకుడు కె. చక్రవర్తి రెడ్డి తో కెరీర్ 25 చిత్రం పంతం చేశారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. నితిన్ న‌టించిన 25వ చిత్రం చల్ మోహన రంగా ఫెయిలైంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ లాంటి మాస్టర్ పీస్ అందించిన నానీ `అష్టా చమ్మ` ఫేం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తన 25 వ చిత్రం `వి`లో న‌టించారు. సుధీర్ బాబు ఇందులో ఒక హీరో. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
Tags:    

Similar News