కోలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ మూవీస్ సాధ్యపడేనా...?

Update: 2020-05-01 23:30 GMT
సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సినీ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి వస్తున్నదే. బాలీవుడ్ లో అప్పటి నుండి ఇప్పటి దాకా మల్టీస్టారర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. కానీ మన సౌత్ సినీ ఇండస్ట్రీలో వీటి సంఖ్య తక్కువే అని చెప్పొచ్చు. ఒక దశలో ఇటు తెలుగు అటు తమిళ్ ఇండస్ట్రీలలో మల్టీస్టారర్ సినిమాలు ఒక రేంజ్ లో వచ్చాయి. క్రమక్రమంగా అలాంటి సినిమాలు తగ్గుతూ వచ్చాయి. దానికి కారణం స్టార్ హీరోల ఇమేజ్.. స్క్రీన్ స్పేస్.. ఫ్యాన్స్ ఒపీనియన్స్ అనే అనేక విషయాలు అడ్డు రావడమే అని చెప్పొచ్చు. ఇక చాలా కాలం తరువాత సౌత్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. వెంకటేష్ - మహేష్ బాబు స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకి ఇండియా వైడ్ క్రేజ్ ఏర్పడింది. దీంతో మిగతా ఇండస్ట్రీలో కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ ని జోడించి మల్టీస్టారర్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు కోలీవుడ్‌లో మల్టీస్టారర్ సెగలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కారణంగా అక్కడి స్టార్ డైరెక్టర్స్ తమిళ్ హీరోలను ఒకటి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మణిరత్నం విక్రమ్ - కార్తీ వంటి హీరోలతో 'పొన్నియిన్ సెల్వన్' అనే ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో విజయ్ - అజిత్ కాంబినేషన్ పై వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక సీనియర్ దర్శకుడు ఈ ఇద్దరి హీరోలను కలపడానికి ప్రయత్నం చేశారట. విజయ్ - అజిత్ సానుకూలంగా స్పందించినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు. రజినీకాంత్ - కమల్ హసన్ కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ వారికి సరైన కథ దొరకడం లేదు. ఇక ప్రస్తుత కాలంలో పాలిటిక్స్ తో బిజీ కావడంతో ఈ కాంబినేషన్ సెట్టయ్యేలా కనిపించడం లేదు. ఇక కోలీవుడ్ బ్రదర్స్ సూర్య - కార్తీ కూడా ఒక సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు.

తమిళ ఇండస్ట్రీ వారు మన ఆర్.ఆర్.ఆర్ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని పాన్ ఇండియా కాన్సెప్ట్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుత హీరోలతో మల్టీస్టారర్స్ సాధ్యపడతాయా. ఎందుకంటే కోలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ ఎక్కడా చూడనంతగా ఉంటాయి. వాళ్ళ ఫ్యాన్ గొడవలు ఓ రేంజ్ లో ఉంటాయన్న విషయం మిగతా ఇండస్ట్రీల వారికి కూడా తెలిసిన విషయమే. ఇక వారి ఫ్యాన్స్ ని కాదని తమిళ స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసే అవకాశమే లేదు. ఒకవేళ చేసినా వారి ఫ్యాన్స్ వాటిని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే డౌట్. అంతేకాకుండా చిన్న చిన్నవాటికే గొడవ పడి వాటిని తారాస్థాయికి తీసుకెళ్లే తమిళ నాట స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమాలు కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో కోలీవుడ్ లో వచ్చిన మల్టీస్టారర్స్ గమనించినా ఈ విషయం అర్థం అవుతుంది. తమ హీరోకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదని తమిళ హీరోల ఫ్యాన్స్ గొడవలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ రేంజ్ లో భారీ మల్టీస్టారర్ సాధ్యపడేనా..? మరి రాబోయే రోజుల్లో వారి ఫ్యాన్స్ మధ్య ఉన్న గీతలను చెరిపేసేలా కోలీవుడ్ స్టార్ హీరోలు కలిసి యాక్ట్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News