వర్మకు షాక్..'దిశ' సినిమా నిర్మాణం ఆపాలని హైకోర్టుకు వినతి

Update: 2020-10-10 10:50 GMT
దేశ వ్యాప్తంగా దిశ హత్యాచర సంఘటన ఎంత సంచలనం రేకెత్తిచ్చిందో తెలిసిందే. నిర్భయ ఘటన తర్వాత ప్రజలందరూ ఏకమై న్యాయం కోసం నినదించారు. ఎప్పుడూ సంచలనాలనే కథా వస్తువుగా తీసుకుని సినిమాలు తీసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటనపై సినిమా ప్రకటించారు. నిర్మాణం కూడా ప్రారంభించారు. ఈ సినిమాకు 'దిశ' అని టైటిల్ పెట్టగా 'ఎన్ కౌంటర్ ' అన్నది కాప్షన్ గా పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణాన్ని ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు. దిశ హత్యచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ నిర్వహిస్తోందని, ఇటువంటి సమయంలో ఆ ఘటనపై చిత్రాన్ని నిర్మించడం తగదని దిశ తండ్రి తరఫు న్యాయవాది నివేదించారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు నివేదించారు. సినిమా నిర్మాణాన్ని ఆపాలని కోర్టుకు వెళ్లిన దిశ తండ్రి వినతిపత్రం మాత్రం అధికారికంగా అందించలేదు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డులకు ఈ విషయమై సాధ్యమైనంత తొందరగా వినతిపత్రం అందజేయాలని ఆ మేరకు దిశ తండ్రి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Tags:    

Similar News