పవన్ సెలక్షన్ కామెడీ అయిపోతోందే..

Update: 2017-03-22 06:25 GMT
రీమేక్స్ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. కొందరు వాటి పట్ల తీవ్ర వ్యతిరేకత చూపిస్తారు. కొందరు రీమేక్ చేస్తే తప్పేంటి అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి అప్పుడప్పుడూ రీమేక్స్ చేస్తూనే వస్తున్నాడు. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లయిన ఖుషి.. గబ్బర్ సింగ్.. సుస్వాగతం రీమేక్సే. ఇప్పుడు ‘కాటమరాయుడు’ కూడా ఆ కోవలోని సినిమానే. దీని తర్వాత ‘వీరం’ రీమేక్ అంటున్నాడు. అది కాక ఇప్పుడు ‘తెరి’ రీమేక్ కూడా తెరమీదికి వచ్చింది. కాకపోతే సమస్య ఏంటంటే.. ఒక సినిమాను రీమేక్ చేయాలనుకున్నపుడు ఆ నిర్ణయం కొంచెం త్వరగా తీసుకోవాలి. కాస్త ముందుగానే రైట్స్ తీసుకోవాలి.

అలా కాకుండా తమిళం నుంచి అనువాదమై తెలుగులో రిలీజై.. టీవీల్లోకి వచ్చేశాక తీరిగ్గా రీమేక్ ఆలోచన చేస్తున్నాడు పవన్. ‘కాటమరాయుడు’ ఒరిజినల్ ‘వీరం’ ఆల్రెడీ తెలుగులోకి ‘వీరుడొక్కడే’ పేరుతో రీమేక్ అయింది. ఆ చిత్రం టీవీల్లో కూడా చాలాసార్లు ప్రసారమైంది. అయినా పవన్ దాన్ని రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ‘తెరి’ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ఈ చిత్రం గత ఏడాది తమిళ వెర్షన్ తో పాటుగా తెలుగులోనూ రిలీజైంది. ‘వీరుడొక్కడే’ తరహాలో ఈ చిత్రం చడీచప్పుడు కూడా రిలీజవ్వలేదు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది దిల్ రాజు. కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారాయన. అలాంటి సినిమాను ఇప్పుడు పవన్ హీరోగా రీమేక్ చేస్తారంటున్నారు. ఈ సినిమా కథేంటో జనాలకు తెలుసు. పైగా అది మనం ఎన్నోసార్లు చూసిన పాత చింత పచ్చడికాయ కథతోనే తెరకెక్కింది. మరి పవన్ కోసం దాన్ని ఎలా మారుస్తారో.. ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News