దాసరి అంత పెద్ద సాహసం చేస్తాడా?

Update: 2016-05-03 06:55 GMT
ఒకప్పుడు దర్శకుడిగా దాసరి నారాయణరావు ఎలాంటి హిట్లిచ్చారో.. ఎంత వైభవాన్ని అనుభవించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే చాలామంది దర్శకుల్లాగే ఓ దశ దాటాక ఆయన ఔట్ డేటెడ్ అయిపోయారు. ఫామ్ కోల్పోయారు. చివరగా ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట ‘ఒసేయ్ రాములమ్మ’తో హిట్టు కొట్టారు దాసరి. ఆ తర్వాత అన్నీ డిజాస్టర్లే. చివరగా రెండేళ్ల కిందట ‘ఎర్రబస్సు’తో మెగా ఫోన్ పట్టారాయన. దాని రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. దీంతో ఇక ఆయన మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లరనే అనుకున్నారంతా. కానీ దర్శకరత్న మాత్రం ఇప్పుడే రిటైరయ్యేలా లేరు. మహాభారతం కథను తెరకెక్కించాలన్నది తన కల అని.. దాన్ని ఐదు భాగాలుగా తీయబోతున్నానని దాసరి ప్రకటించడం విశేషం. మహాభారత చివరి భాగమే తన చివరి సినిమా అని ఆయన ప్రకటించారు.

ఇప్పటికే మహాభారతం సినిమాకు సంబంధించి రెండు భాగాలకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. ప్రస్తుతం మూడో భాగానికి సంబంధించి పని నడుస్తోందని దాసరి చెప్పారు. దాని కంటే ముందు అందరూ కొత్త వాళ్లతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నానని.. తన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా కూడా ఓ సినిమా త్వరలోనే మొదలవుతుందని దాసరి వెల్లడించారు. ఐతే ఈ సినిమాల సంగతి సరే కానీ.. ఈ వయసులో దాసరి మహాభారత కథను ఐదు భాగాలుగా తెరకెక్కించడం సాధ్యమా అన్నది ప్రశ్న. ఐదు సినిమాల సిరీస్ తీయాలంటే వందల కోట్లు కావాలి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కావాలి. ఎంతో శ్రమకోర్చి సినిమా తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజమౌళి మాత్రమే ఇలాంటి సినిమా తీయగలడని జనాల నమ్మకం. పైగా జక్కన్నకు కూడా మహాభారత కథను తెరకెక్కించే ఆలోచన ఉంది. కానీ అంతకంటే ముందు దాసరి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టేశానంటున్నాడు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పడు తెరమీదికి వస్తుందో చూడాలి.
Tags:    

Similar News