ఓ వడ్రంగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్ ఎలా అయ్యారు..?

Update: 2020-05-14 04:15 GMT
సినిమా నిర్మాణంలోని 24 కళల్లో టాలీవుడ్ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు గారు ప్రావిజ్ఞలు.. అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కారు. సినిమాల్లో ఆయన చేయని పనిలేదు.. ఆయన సాధించని విజయం లేదు.. దర్శకరత్నగా, నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దాసరి నారాయణ రావు ప్రస్తుతం మన మధ్య లేరు... అసలు ఎవరీ దాసరి.. ఎక్కడి నుంచి వచ్చారు.? ఎలా ఎదిగారో తెలుసుకుందాం..

* బాల్యం.. విద్యాభ్యాసం..
దాసరి నారాయణ రావు గారు 1944 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా  పాలకొల్లులో జన్మించారు. సాయిరాజు-మహాలక్ష్మీ దాసరి తల్లిదండ్రులు. వీరికి మొత్తం ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లల్లో దాసరి మూడోవాడు.. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్న పెద్దనాన్నలు పొగాకు వ్యాపారం చేసేవారు. ఓ దీపావళి నాడు పొగాకు గోడౌన్ తగలబడి ఆర్థికంగా వారి కుటుంబం దెబ్బతింది. పొలాలు కూడా అమ్మి అప్పులు తీర్చారు. దాసరి నాన్న గారి వద్ద డబ్బులు లేక దాసరిని స్కూలును మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టాడు. అప్పుడు దాసరి జీతం నెలకు రూపాయి మాత్రమే.. ఒక మాస్టారు తోడ్పాటుతో మళ్లీ స్కూలు బాట పట్టిన దాసరి ఆ తర్వాత పరిస్థితి మెరుగయ్యాక పనిచేసుకుంటూనే చదివారు..  దాసరి కళాశాలలో బీఏ చదివే రోజుల్లోనే నాటకాల్లో నటించేవాడు..రంగస్థల నటుడిగా.. నాటక రచయితగా ఎదిగాడు. అప్పుడే సినిమాలపై కూడా ఆశ కలిగింది.

*సినీ రంగ ప్రవేశం..
చదువు పూర్తయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ లో పొట్టపోసుకున్నారు. కొంత కాలానికి కాకినాడలో ఎస్.ఎన్ బ్రదర్స్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అదే కంపెనీ హైదరాబాద్ కార్యాలయంలో సహాయ మేనేజర్ గా పనిచేశారు. అప్పుడే చాలా నాటకాలు వేసి సినీ దర్శకుల దృష్టిలో పడ్డారు.  దాసరి ప్రదర్శనల్ని చూసిన హృషికేష్ పిక్చర్స్ అధినేత కృష్ణయ్య  అందం కోసం పందెం చిత్రంలో ప్రధాన హాస్యనటుడి పాత్రను ఇచ్చారు. దాసరి తొలి చిత్రం ఇదే.. ఆ చిత్రం కోసం మద్రాస్ వెళ్లడానికి రెండు నెలల సెలవు ఇవ్వకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాస్ వెళ్లిపోయాడు. ఆ పాత్ర తర్వాత సహాయ దర్శకుడిగా.. ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. దాసరి కుతూహలం చూసిన బీఎన్ రెడ్డి రంగుల రాట్నం చిత్రానికి రచయిత పద్మరాజు వద్ద సహాయకుడిగా అవకాశం ఇచ్చారు.  

అనంతరం ఎన్నో చిత్రాలకు రచయితగా.. సహాయ దర్శకుడిగా పనిచేసిన దాసరి.. నిర్మాత కే.రాఘవ నిర్మించిన ‘‘తాతా మనవడు’’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.  ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇక దాసరి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత వరుస విజయాలు క్యూ కట్టాయి.

దాసరి ఇప్పటివరకు దాదాపు 150కిపైగా చిత్రాలు తీసి గిన్నిస్ బుక్ లో ఎక్కారు.. 1978లోనే తారక ప్రభు ఫిలింస్ పేరుతో చిత్ర నిర్మాతగా 53 చిత్రాలు నిర్మించారు. సుమారు 63 చిత్రాల్లో నటించారు. 100 వ చిత్రంగా చిరంజీవితో లంకేశ్వరుడు.. 150వ చిత్రంగా బాలక్రిష్ణ తో పరమవీర చక్ర సినిమాలను తీశాడు. చివరగా మంచు విష్ణుతో దాసరి ‘ఎర్రబస్సు’ అనే చిత్రాన్ని తీశారు.  దాసరి సుధీర్ఘ సినీ జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్రహీరోలతో ఎన్నో ఆణిముత్యాలు, ఇండస్ట్రీ హిట్ చిత్రాలు తీశారు.  1983లో దాసరి తీసిన ‘‘మేఘసందేశం’’ సినిమాకు తొమ్మిది నంది పురస్కారాలు దక్కాయి.  1998లో తీసిన ‘కంటే కూతుర్నే కను’ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.

*రాజకీయ ప్రవేశం..
రాజీవ్ గాంధీ పిలుపు మేరకు దాసరి నారాయణ రావు 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ లో ఆది నుంచి కొనసాగారు. మన్మోహన్ హయాంలో కేంద్రం బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మధ్యలో తెలుగుతల్లి అనే పార్టీని స్థాపించి విఫలమై మళ్లీ కాంగ్రెస్ లోనే కొనసాగారు.

*ఎందరికో లైఫ్ ఇచ్చి గాడ్ ఫాదర్ గా..
చిత్ర పరిశ్రమలో దాసరి గాడ్ ఫాదర్ గా కొనసాగుతున్నారు. ఆయన ఎంతో మంది నటులు, దర్శకులు , టెక్నీషియన్స్ కు లైఫ్ ఇచ్చారు. వందకి పైగా సినిమాలు తీసిన కోడి రామకృష్ణ,తో పాటు రవిరాజ పినిశెట్టి, కే. మురళీ మోహన్, రేలంగి నరసింహారావు, కే.ఎన్ రవికుమార్, సురేష్ కృష్ణ,  తదితర ప్రముఖ దర్శకులు దాసరి శిష్యులే.. ఇక దాసరి పరిచయం చేసిన నటులు మోహన్ బాబు, అన్నపూర్ణమ్మ, ఈశ్వరరావు, ఆర్ నారాయణమూర్తి  తదితరులకు దాసరియే లైఫ్ ఇచ్చారు. వందల సంఖ్యలో సాంకేతిక నిపుణులకు తోడ్పాటు నందించారు.

అందుకే దాసరి మరణంతో తెలుగు ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది..  తెలుగు సినిమా చరిత్రపై ఎనలేని ముద్ర వేసిన దాసరికి తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రతి ఒక్కరు ఇప్పటికీ తలుచుకుంటున్నారు. ఆయన ఇండస్ట్రీ రికార్డులు, సహాయాలు మాత్రం ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.
Tags:    

Similar News