సాయంత్రం 7 అయితే రజనీకాంత్ ఈ బార్‌లోనే..!
కేవలం పూర్ణ చంద్రరావు గారే కాదు, రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ రాజా బహదూర్ కూడా పలు సందర్భాల్లో చోళా షెల్టర్ బార్ గురించి ప్రస్థావించారు.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో అంతకుముందు కండక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనకున్న అలవాట్ల గురించి కొందరు ఆయన స్నేహితులు గతంలో కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా రజనీ స్నేహితుడు రాజ్ బహదూర్ ఆయన తాగుడు అలవాటుపై చాలా ఓపెన్ గా మాట్లాడారు.
ఇప్పుడు ప్రముఖ వెటరన్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావుతో సీనియర్ జర్నలిస్ట్ శివ మళ్లల ముచ్చట్లలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రజనీకాంత్ నటుడిగా ఉన్న సమయంలో డ్యూటీ ముగియగానే రాత్రి 7 గంటలయ్యేసరికి కచ్చితంగా చోళా షెల్టర్ బార్ (చెన్నై)లో ఉండేవారని పూర్ణ చంద్రరావు గారు గుర్తు చేసుకున్నారు. రజనీని తాను హిందీ సినీపరిశ్రమకు పరిచయం చేసిన సమయంలో తాగుడు అలవాటు ఉండేదని కూడా గుర్తు చేసుకున్నారు. రజనీ రాత్రి 7 అయితే ఎక్కడ ఉంటారు? అని ఎవరిని అడిగినా ఆయన చోళా షెల్టర్ బార్ లో ఉంటారని చెప్పేవారు. ఆయన వల్ల ఆ బార్ కి అంత పేరొచ్చిందని గుర్తు చేసుకున్నారు.
అయితే ఓసారి కలిసి డ్రింక్ చేద్దామని ఆహ్వానించిన పూర్ణ చంద్రరావు అందించిన బ్లూలేబుల్ బ్రాండ్ విస్కీ తాగిన తర్వాత చాలా బావుంది పూర్ణ చంద్రరావు గారు! అంటూ రజనీ ఆనందం వ్యక్తం చేసారట. ఈ విషయాలన్నీ శివ మళ్లల ట్యాగ్ తెలుగు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నిజానికి మందు బాటిల్ లేనిదే నిద్ర పట్టని స్థితి ఆరోజుల్లో. ఆ సమయంలో రజనీకి మద్యపానం, ధూమపానం, మాంసాహారం (ముఖ్యంగా మటన్ పాయా తినడం) వంటి విపరీతమైన అలవాట్లు ఉండేవి. మద్యం లేనిదే ఆయనకు రోజు గడిచేది కాదని రజనీ స్నేహితులు తెలిపారు.
కేవలం పూర్ణ చంద్రరావు గారే కాదు, రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ రాజా బహదూర్ కూడా పలు సందర్భాల్లో చోళా షెల్టర్ బార్ గురించి ప్రస్థావించారు. రజనీకాంత్ బస్ కండక్టర్‌గా ఉన్న రోజుల్లో రాజ్ బహదూర్ అదే బస్సులో డ్రైవర్‌గా ఉండేవారు. రజనీకాంత్‌లోని నటుడిని గుర్తించి, ఆయన్ను మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించి నటుడిగా మారడానికి వెన్నుముకగా నిలిచింది ఈయనే.
రాజా బహదూర్ ప్రకారం.. రజనీకాంత్ కండక్టర్‌గా ఉన్న సమయంలో డ్యూటీ ముగియగానే రాత్రి 7 గంటలయ్యేసరికి చోళా షెల్టర్ బార్ లో ఉండేవారని రాజ్ బహదూర్ చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు, హోదా పెరగడంతో ఈ అలవాట్లు మరింత ఎక్కువయ్యాయని, ఒకానొక దశలో ఆరోగ్యం బాగా దెబ్బతిందని రాజ్ బహదూర్ పేర్కొన్నారు.
అయితే రజనీకాంత్ తన భార్య లతను కలిసిన తర్వాతే ఆయన జీవితం మారిందని రాజ్ బహదూర్ చెప్పారు. ఆమె ప్రేమ, క్రమశిక్షణతో రజనీ ఆ వ్యసనాల నుంచి బయటపడి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకున్నారని వివరించారు.
నిర్మాత పూర్ణ చంద్రరావు, రాజ్ బహదూర్ చెప్పినట్లే, రజనీకాంత్ కూడా గతంలో ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. నేను కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో, ఎంత మద్యం సేవించేవాడినో నాకే తెలియదు. మాంసం, మద్యం, సిగరెట్లు అనేవి ఒక ప్రమాదకరమైన కాంబినేషన్. లత నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను 60 ఏళ్లకే చనిపోయేవాడిని! అని బాహాటంగానే తన సన్నిహితులు చెప్పిన మాటలను ధృవీకరించారు. నేటికీ రజనీకాంత్ తన స్నేహితుడు రాజ్ బహదూర్ ని మర్చిపోలేదు. ఆయన బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి రాజ్ బహదూర్ ఇంట్లోనే గడుపుతారు. అలాగే పూర్ణ చంద్రరావు వంటి వెటరన్ నిర్మాతల అభిరుచిని, వారి వ్యక్తిత్వాన్ని రజనీకాంత్ స్ఫూర్తిగా తీసుకున్నారు.
ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు (లక్ష్మీ ప్రొడక్షన్స్) రజనీకాంత్‌తో కలిసి ప్రధానంగా మూడు ముఖ్యమైన సినిమాలు నిర్మించారు. రజనీకాంత్‌ను హిందీ చిత్ర పరిశ్రమకు (బాలీవుడ్) పరిచయం చేసింది కూడా పూర్ణచంద్రరావు. రజనీకాంత్ నటించిన మొదటి హిందీ సినిమా `అంధాకానూన్` (1983) లో అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, రజనీకాంత్‌కు ఉత్తరాదిన మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రజనీకాంత్ హీరోగా నటించిన హిందీ యాక్షన్ కామెడీ చిత్రం `జాన్ జానీ జనార్దన్`(1984).. ఇది తమిళంలో రజనీ నటించిన `మూండ్రు ముగమ్`చిత్రానికి రీమేక్. ఇందులో రజనీకాంత్ త్రిపాత్రాభినయం (మూడు పాత్రలు) చేశారు. రజనీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ తమిళ సినిమా నాన్ సిగప్పు మనితన్ ( 1985) చిత్రానికి కూడా పూర్ణచంద్రరావు ర్మాత. ఇది హిందీ సినిమా `ఆజ్ కీ ఆవాజ్` కు రీమేక్. రజనీకాంత్ నటించిన `చట్టానికి కళ్లు లేవు` (1981) చిత్రానికి కూడా పూర్ణచంద్రరావు గారే కథను అందించారు. ఆయన నిర్మాత కాదు.
పూర్ణచంద్రరావు గారికి, రజనీకాంత్‌కు మధ్య చాలా కాలం పాటు సన్నిహిత స్నేహబంధం ఉండేది. రజనీకాంత్ తన కెరీర్ ఎదుగుదలలో పూర్ణచంద్రరావు గారి పాత్ర చాలా ఉందని పలు సందర్భాల్లో చెప్పారు.