మెగాస్టార్ కి దాదాసాహెబ్ ఫాల్కే ఎపుడిస్తారు?

Update: 2021-04-04 04:01 GMT
సినీపుర‌స్కారాల్లో అత్యంత ప్ర‌తిభావంతుల‌కు.. ఇండ‌స్ట్రీకి ద‌శాబ్ధాల పాటు గొప్ప సేవ‌లందించిన వారికి ఇచ్చే పుర‌స్కారాల్లో దాదా సాహెబ్ ఫాల్కేకి ఉన్న గుర్తింపు తెలిసిందే. భారతీయ సినిమా అభివృద్ధికి ఫాల్కే అవార్డు భారతదేశపు అత్యున్నత గౌరవం. భారతీయ సినిమా పితామహుడిగా గౌరవించబడే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీద ఈ అవార్డు 1969 లో స్థాపించారు. గ్రహీతకు స్వర్ణ కమల్ (గోల్డెన్ లోటస్) పతకం- శాలువ .. రూ .10 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఈ పుర‌స్కారం ఇప్ప‌టికే ఎందరో ప్ర‌తిభావంతుల్ని వ‌రించింది.

సత్యజిత్ రే- నాగి రెడ్డి- రాజ్ కపూర్- లతా మంగేష్కర్- అక్కినేని నాగేశ్వరరావు- దిలీప్ కుమార్- శివాజీ గణేషన్- ఆశా భోంస్లే వంటి వారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ 2018 లో దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డుతో గౌరవాన్ని అందుకున్నారు. ఆ త‌ర్వాత 2021లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఈ గౌర‌వం ద‌క్కింది. అయితే ఇండ‌స్ట్రీలో ఈ పుర‌స్కారం అందుకోగ‌ల గొప్ప లెజెండ్స్ ఇంకా కొంద‌రు ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయితే ఇటీవ‌ల ర‌జ‌నీకి ఫాల్కే పుర‌స్కారం ప్ర‌క‌టించిన అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి ర‌జ‌నీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌రిశ్ర‌మ‌కు మీరు చేసిన సేవ‌ల‌కు ఇది గౌర‌వం.. మీరు దీనికి అర్హులు.. అని చిరు వ్యాఖ్యానించారు. అనంత‌రం మెగాభిమానులు సోష‌ల్ మీడియాల్లో పెద్ద డిబేట్ ర‌న్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. అందులో ఒక అభిమాని చిరుకి దాదాసాహెబ్ ఫాల్కే గౌర‌వం ద‌క్కాల‌ని ఆకాంక్షించారు.

``అమితాబ్ కి వ‌చ్చింది.. ర‌జ‌నీకి వ‌చ్చింది.. ఇక మీకు కూడా వ‌స్తే అన్ని ఇండ‌స్ట్రీల పిల్ల‌ర్స్ కి వ‌చ్చిన‌ట్టే. దానికోస‌మే వెయిటింగ్ స‌ర్.. `` అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం. అల్లు అర‌వింద్ ఆ ప్ర‌య‌త్నంలోనే ఉంటారు! అని కూడా ఓ అభిమాని సెటైరిక‌ల్ గా వ్యాఖ్యానించ‌డం ట్వీట్ల‌లో క‌నిపించింది.

అయితే ర‌జ‌నీకి ఫాల్కే అవార్డ్ ఇవ్వ‌డం వెన‌క భాజ‌పాకు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలున్నాయంటూ మ‌రో డిబేట్ ర‌న్ అవుతున్న సంగ‌తి  తెలిసిందే. రాజ‌కీయాల‌తో ముడిప‌డిన అవార్డుల ప్ర‌హ‌స‌నంపై ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో అనాస‌క్తి నెల‌కొంది.  దీనిపై నిరంత‌రం ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. రాజ‌కీయాల ప్ర‌వేశంతో స‌ముచిత ప్ర‌తిభ‌కు ఇచ్చే అవార్డుల‌కు గౌర‌వం  త‌గ్గిపోవ‌డం బాధాక‌రం అన్న ఆవేద‌నా వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News