#మ‌హ‌మ్మారీ పంచ్.. టాలీవుడ్ పీడ‌క‌ల‌కు ఏడాది!

Update: 2021-03-15 00:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ పుట్టుక‌కు ఏడాది పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా గ‌త ఏడాది మార్చి 11న క‌రోనా గురించి ప్ర‌పంచం తెలుసుకుంది. ఆ త‌ర్వాత అంత‌కంత‌కు అన్ని దేశాల‌కు విస్త‌రించ‌డం మొద‌లైంది. అప్ప‌టికి ఈ వైర‌స్ ప్ర‌భావం మ‌రీ అంత దారుణంగా ఉధృతంగా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. నెల‌.. రెండు నెల‌లు.. లేదా ఆరు నెల‌ల్లో ప‌రిష్కారం దొరుకుతుంద‌ని అనుకున్నారు.

కానీ ముంచుకొచ్చిన మ‌హ‌మ్మారీ ఆషామాషీ ఏం కాద‌ని ప్రూవైంది. అన్ని రంగాల్ని కుదిపేసింది. కార్మికుల్ని రోడ్డుకీడ్చింది. ఉద్యోగులు స‌హా కంపెనీలు ఎంతో తీవ్ర‌మైన ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ఇక అన్ని సినీప‌రిశ్ర‌మ‌లతో పాటు టాలీవుడ్ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. నిర్మాణ సంస్థ‌లు తీవ్ర న‌ష్టాల్లోకి వెళ్లిపోయాయి. షూటింగుల్లేవ్.. థియేట‌ర్లు తెర‌వ‌లేని ప‌రిస్థితి. దీంతో ప‌రిశ్ర‌మ ఆదాయం జీరో అయిపోయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమ కు క‌రోనా ఒక చెత్త పీడకల లాంటిది. ఈ ఏడాది మార్చితో మొదటి వార్షికోత్సవం సంద‌ర్భంగా నాటి భ‌యాన‌క‌ ఘ‌ట‌న‌లు మ‌రోమారు క‌ళ్ల ముందు మెదులుతున్నాయి.

2020 లో ఈ రోజునే దేశంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం ప్రారంభించిన తరువాత 2020 మార్చి 31 వరకు థియేటర్లను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా చాలా కొద్ది మంది మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ అతిపెద్ద షట్ డౌన్ కి గుర‌వుతుంద‌ని ఊహించ‌గ‌లిగారు. అనంత‌రం చాలా నెలలు థియేటర్లు మూసివేసారు. సిబ్బంది మైనస్ జీతంతో ఉద్యోగాలు చేయాల్సొచ్చింది. మెగాస్టార్ కృషితో సీసీసీ చేసిన సాయంతో పరిశ్రమ కార్మికులు బ‌తుకు వెళ్ల‌దీశారు. చాలా మంది ప‌రిశ్ర‌మ హీరోలు ప్ర‌జ‌ల్ని సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ధాతృసాయం చేసి మాన‌వ‌త‌ను చాటుకున్నారు.

జూనియ‌ర్లు సీనియ‌ర్లు ధ‌నికులు అనే విభేధం లేకుండా అంద‌రూ ఆరోజుల్లో ఇబ్బంది ప‌డ్డారు. కొందరు థియేట్రికల్ విడుదలను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. షూటింగులు మొద‌ల‌వుతాయా లేదా.. థియేట‌ర్లు తెరుస్తారా లేదా? అనే కంటే అస‌లు జ‌నం మిగులుతారా లేదా? అన్న టెన్ష‌న్ కూడా ఉధృతి వేళ త‌లెత్తింది. టాలీవుడ్ పై ఆధార‌ప‌డి సినీమీడియా సైతం తీవ్రంగా ఇబ్బంది ప‌డింది. ప‌త్రికా మీడియా ఉద్యోగాల కోత క‌ల‌వ‌ర‌పెట్టింది. ఇత‌ర మీడియాలు ప్ర‌క‌ట‌న‌ల ఆదాయాన్ని కోల్పోయాయి. అయినా కొన్ని బ‌ల‌మైన సంస్థ‌లు త‌మ ఉద్యోగుల్ని నిల‌బెట్టుకునేందుకు క‌ష్టంలో ఆదుకునేందుకు కోత విధింపుతో జీతాలిచ్చాయి. మాన‌వ‌త‌ను చాటుకున్నాయి.

అయితే ఆ స‌హ‌నానికి ఇప్పుడు ప్ర‌తిఫ‌లం క‌నిపిస్తోంది. 2020 ముగింపులో క్రిస్మస్ స‌మ‌యంలో విడుదలైన సోలో బ‌తుకే సో బెటర్ ఫ‌లితం ఉత్సాహం నింపింది. సంక్రాంతి నుండి వెనక్కి తిరిగి చూడాల్సిన ప‌ని లేకుండా సినిమాలు ఆడుతున్నాయి. క్రాక్ - ఉప్పెన-నాంది చిత్రాలు ఊపు పెంచాయి. ఇటీవ‌ల రిలీజైన జాతిర‌త్నాలు ఫ‌లితం రెట్టింపు ఉత్సాహం నింపుతోంది.

2021 తిరిగి ఆశ‌ల్ని నింపింది. ప్ర‌తిదీ సానుకూలంగా కనిపిస్తోంది. జ‌నం థియేట‌ర్ల‌కు వెళుతున్నారు. అయితే ఇంకా ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని అనుకోవ‌ద్దు. కరోనా రెండో వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. అందువ‌ల్ల తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో అప్ర‌మ‌త్త‌తో ఉండాలి. ముఖ్యంగా థియేట‌ర్ల‌కు వెళ్లే వాళ్లు పూర్తి నియ‌మ‌నిబంధ‌న‌ల్ని పాటించాలి. జాగ్ర‌త్త వ‌హించాలి. అప్పుడే అంద‌రూ క్షేమంగా ఉంటారు. ప‌రిశ్ర‌మ‌లు బావుంటాయి.




Tags:    

Similar News