పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ప‌క్క చూపులా.. ఎందుక‌లా?

Update: 2020-05-18 04:05 GMT
తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ 19 అంత‌కంత‌కు విజృంభిస్తోంది. ఓవైపు లాక్ డౌన్ స‌డ‌లిస్తున్నా ప్ర‌భుత్వాల్లో కంగారు మాత్రం అలానే ఉంది. ఇక క‌రోనాతో స‌హ‌జీవ‌నం చేయ‌డ‌మేన‌ని సీఎంలు తేల్చి చెప్పారు. దీంతో ప్ర‌జ‌లు కూడా మాన‌సికంగా ప్రిపేరైపోతున్నారు. ఇప్ప‌టికే రెడ్ జోన్లు కంటైన్ మెంట్ జోన్లు వ‌దిలేస్తే .. ఇత‌ర చోట్ల ప్ర‌జాజీవ‌న వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచే స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే అన్ని రంగాల‌కు స‌డ‌లింపులు ఇస్తున్నారు. కానీ సినీప‌రిశ్ర‌మ విష‌యంలో మాత్రం ఆచి తూచి అడుగులేస్తుండ‌డం విశేషం.

థియేట‌ర్లు- మాల్స్ ని తెరిచేందుకు ఇంకో రెండు మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్టేట్టు ఉంద‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేయ‌డంతో దానిపై సినిమా వాళ్ల‌కు బెంగ ఏదీ లేదు కానీ ఇప్పుడు చిత్రీక‌ర‌ణ‌లు ముగించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి సిద్ధంగా ఉన్న వాటిపైనే అస‌లు బెంగ‌. త్వ‌ర‌గా ఆ నిర్మాణానంత‌ర ప‌నుల్ని పూర్తి చేసి థియేట‌ర్ల కోసం వేచి చూడాల‌న్న ధోర‌ణి నిర్మాత‌ల్లో క‌నిపిస్తోంది. కానీ దానికి కూడా టీ ప్ర‌భుత్వ అనుమ‌తి అయితే లేదు.

దీంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అవ‌కాశం ఎక్క‌డుందో వెతుకుతున్నార‌ట మ‌నోళ్లు. ఇప్ప‌టికే త‌మిళం మ‌ల‌యాళ చిత్రాల‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి అనుమ‌తులు ఉన్నాయి. దీంతో అటు వైపు వెళ్లేందుకు యోచిస్తున్నార‌ట‌. మొద‌ట‌గా రవి తేజ `క్రాక్` సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చెన్నై ల్యాబులో ప్రారంభించేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి‌. ఇంకో రెండు మూడు నెల‌లు ఏదీ తేల‌దు అని అనుకుంటే ఏదో దారి చూసుకోవ‌డ‌మే మేల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారో ఏమిటో కానీ ఇత‌రులు కూడా క్రాక్ బాట‌లోనే వెళ్ల‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారట‌. అయితే అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ప‌రిమిత స్టాఫ్ తో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చేసుకోవ‌చ్చ‌ని ఇక్క‌డ‌ వెసులుబాటు క‌ల్పించాల్సి ఉంటుంది. హైద‌రాబాద్ లో ప్ర‌సాద్ లాబ్స్- శ‌బ్ధాల‌య‌- సార‌థి స్టూడియోస్- రామానాయుడు స్టూడియోస్- అన్న పూర్ణ స్టూడియోస్ స‌హా ప‌లు ల్యాబుల్లో నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతుంటాయి. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ మూగ‌నోము పాటిస్తున్నాయి.
Tags:    

Similar News