మూవీ రివ్యూ: 'చిత్రలహరి'

Update: 2019-04-12 07:32 GMT
చిత్రం : 'చిత్రలహరి'

నటీనటులు: సాయి తేజ్ - కళ్యాణి ప్రియదర్శిని - నివేథ పేతురాజ్ - పోసాని కృష్ణమురళి - సునీల్ -వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - భరత్ - సుదర్శన్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - రవిశంకర్ యలమంచిలి - మోహన్ చెరుకూరి
రచన - దర్శకత్వం: కిషోర్ తిరుమల

ఒకటి రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న హీరో సాయిధరమ్ తేజ్. ఈసారి అతను తనకు అలవాటైన కథలు వదిలేసి సక్సెస్ కోసం కాస్త భిన్నమైన ప్రయత్నం చేశాడు. అదే చిత్రలహరి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సక్సెస్ కోసం సాయి తేజ్ అని పేరు కూడా మార్చుకున్న ‘చిత్రలహరి’ ఎలాంటి ఫలితాన్నందించేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

విజయ్ కృష్ణ (సాయి తేజ్) పేరులో తప్ప జీవితంలో విజయం ఉండదు. అతడి దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ దానికి తగ్గ ఫలితం దక్కక నైరాశ్యంలో ఉంటాడు. ఇలాంటి సమయంలో అతడికి లహరి (కళ్యాణి ప్రియదర్శిని) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ కొన్నాళ్ల తర్వాత విజయ్ తీరు నచ్చక అతడికి దూరం అవుతుంది లహరి. జీవితంలో విజయం సాధించలేక.. ప్రేమించిన అమ్మాయీ దూరమై మరింత నైరాశ్యంలోకి వెళ్లిపోతాడు విజయ్. ఇలాంటి స్థితి నుంచి తన జీవితంలో, ప్రేమలో గెలవడానికి విజయ్ ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఏ అడ్డంకులూ లేకుండా జీవితంలో విజయం సాధించిన వాళ్ల కథలు ఎవరికీ ఆసక్తి కలిగించవు. ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. ఓటములు ఎదుర్కోవాలి. ఆ తర్వాత విజయం సాధించాలి. ఇలాంటి కథలు వినడానికైనా.. చదవడానికైనా.. తెరపై చూడటానికైనా బాగుంటాయి. వెండి తెరపై ఇదో పెద్ద సక్సెస్ స్టోరీ. ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యే ఇలాంటి కథలు తెరపై బోలెడన్ని చూశాం. ఈ కోవలోనే వచ్చిన కొత్త సినిమా ‘చిత్రలహరి’. విజయం కోసం పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి.. చివరగా ఒక బ్రేక్ సాధించిన ఓ వ్యక్తి కథను చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల. అతడి ప్రయత్నంలో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇందులో ఆసక్తి రేకెత్తించే పాత్రలున్నాయి. కథాకథనాల్లో అక్కడక్కడా మంచి ఫీల్ కనిపిస్తుంది. ఆహ్లాదం పంచే సన్నివేశాలూ ఉన్నాయి. కానీ ‘చిత్రలహరి’ని ఒక పెద్ద సక్సెస్ స్టోరీ చేయడానికి అవకాశాలున్నప్పటికీ..ఆ దిశగా అనుకున్నంత కసరత్తు చేయలేదనిపిస్తుంది. ఇందులోని పాత్రల్లో కావచ్చు.. ప్రేమకథలో కావచ్చు.. కథలో మలుపుకు కారణమయ్యే కాన్ఫ్లిక్ల్ పాయింట్లో కావచ్చు.. ఉండాల్సినంత గాఢత లేకపోయింది. దీని వల్ల ‘చిత్రలహరి’ జస్ట్ ఓకే అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయలేకపోయింది.

‘చిత్రలహరి’ కథలో ఏ కొత్తదనం లేదు. ఐతే కథనం.. పాత్రల చిత్రణలో ప్రత్యేకత చూపించడం ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించాలని చూశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ ప్రయత్నం కొంత మేర విజయవంతమైంది. హీరో హీరోయిన్లతో పాటుగా సహాయ పాత్రలకు కూడా ఒక వ్యక్తిత్వం ఉండేలా తీర్చిదిద్దడం ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు పోసాని చేసిన హీరో తండ్రి పాత్ర. కొడుకు ఫెయిల్యూర్లతో అల్లాడిపోతుంటే.. అతడిలో ధైర్యం నింపి.. విజయం దిశగా నడిపించే ఆ పాత్ర ప్రేక్షకుల్ని ఇట్టే మెప్పిస్తుంది. తండ్రీ కొడుకుల బంధం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక హీరోయిన్లిద్దరి క్యారెక్టరైజేషన్లోనూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఎదుటి వాళ్లు చెప్పేదంతా నమ్మేస్తూ.. సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేని అమాయకురాలు ఒకరైతే.. దీనికి పూర్తి విరుద్ధంగా చాలా ప్రాక్టికల్ గా ఉంటూ ఎవరినైనా ప్రభావితం చేయగల అమ్మాయిగా మరొకరి పాత్ర ఉంటుంది. హీరో పాత్ర సైతం ప్రత్యేకత చాటుకుంటుంది. ఐతే ఈ పాత్రల్ని సరిగ్గా ఉపయోగించుకునేలా బలమైన కథ రాయడంలో కిషోర్ విఫలమయ్యాడు.

కేవలం జీవితంలో గెలవడానికి హీరో చేసే ప్రయత్నాన్ని మాత్రమే చూపిస్తే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా అనిపిస్తుందని.. ఆహ్లాదం పంచేందుకు.. భావోద్వేగాలు పండించేందుకు ఒక ప్రేమకథను జోడించాడు దర్శకుడు. ఐతే అందులోనే బలం లేకపోయింది. హీరో హీరోయిన్లు ప్రేమలో పడటానికి సరైన కారణాలు కనిపించవు. అలాగే విడిపోవడానికి దారి తీసిన కారణాలు కూడా చిన్నగానే కనిపిస్తాయి. ఎంత చిన్న కారణంతో అయినా విడిపోవచ్చు కానీ తెరపై దాన్ని ఎంత కన్విన్సింగ్ చెబుతారన్నది ముఖ్యం. ఇక్కడ బ్రేకప్ జరగాలి కాబట్టి జరిగింది అన్నట్లుగా చూపిస్తే ప్రేక్షకుడిలో ఎమోషన్ తీసుకురావడం కష్టం. కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా ప్రేక్షకుడిలో అంతగా కదలిక తీసుకురావు. ఐతే ప్రేమకథ బలహీనం అనే సంగతి పక్కన పెడితే.. ప్రథమార్ధం చాలావరకు ఆహ్లాదంగానే సాగిపోతుంది. సింపుల్ హ్యాూమర్ తో చాలా వరకు సన్నివేశాలు సరదాగా సాగిపోవడంతో ప్రథమార్ధంలో ఎక్కడా పెద్దగా బోర్ కొట్టదు. సాయితేజ్-సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రథమార్ధానికి ప్రధాన ఆకర్షణ. కిషోర్ మంచి డైలాగ్స్ రాయడం వల్ల కూడా చాలా సన్నివేశాలుు పాసైపోయాయి.

ఐతే ద్వితీయార్ధంలో కథపై ఒక అంచనాకు వచ్చేయడం.. నరేషన్ మరీ స్లో అయిపోవడంతో ‘చిత్రలహరి’ కొంచెం భారంగానే గడుస్తుంది. అంతిమంగా హీరో విజయం సాధించడమే ఈ కథకు ముగింపు అన్నది అర్థమైపోతుంది. ఆ తర్వాత వ్యవహారమంతా ఫిల్లింగ్ లాగా అనిపిస్తుంది. హీరో విజయానికి దారి తీసే ‘యాప్’ వ్యవహారం ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించదు. మరోవైపు హీరో ప్రేమకథలో వచ్చే మలుపులు.. దాని ముగింపు కూడా మామూలుగా అనిపిస్తాయి. ఒకసారి బ్రేకప్ అయి మళ్లీ ఎదురు పడ్డాక ప్రేమికులిద్దరూ స్పందించే తీరు కొంచెం చిత్రంగానే అనిపిస్తుంది. ఐతే సాయితేజ్-పోసాాని మధ్య వచ్చే ఎపిసోడ్.. వెన్నెల కిషోర్ పంచే కొన్ని నవ్వులు ద్వితీయార్ధాన్ని కొంత వరకు నిలబెట్టాయి. దర్శకుడు కిషోర్ తిరుమలది టిపికల్ స్టయిల్. కామెడీ సీన్ అయినా..  ఎమోషనల్ సీన్ అయినా.. ఎక్కడా హడావుడి ఉండదు. ఒక సైలెన్స్.. కామ్ నెస్ తో సినిమాను నడిపిస్తాడతను. కానీ ఇంపాక్ట్ మాత్రం బలంగా ఉండేలా చూసుకుంటాడు. అతడి గత రెండు సినిమాల్లోనూ ఆ విషయాన్ని గమనించవచ్చు. ఐతే ‘చిత్రలహరి’లో సైలెన్స్.. కామె నెస్ మరీ ఎక్కువ అయిపోయింది. దీని వల్ల సన్నివేశాలు మరీ నత్తనడకన సాగుతున్న భావన కలుగుతుంది. ‘ఇంపాక్ట్’ అనుకున్న స్థాయిలో లేదు. ‘చిత్రలహరి’లో  అక్కడక్కడా మంచి మూమెంట్స్.. ఆకట్టుకునే పాత్రలు ఉన్నప్పటికీ.. కథ.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలహీనంగా ఉండటం వల్ల ఇది సగటు సినిమాలా అనిపిస్తుందంతే.

నటీనటులు:

సాయి తేజ్ గా మారిన సాయిధరమ్ తేజ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. అతడి గత సినిమాల ఛాయలేమీ ఇందులో కనిపించడు. ఎక్కడా హీరోయిజం లేకుండా సగటు కుర్రాడిగా అతడిని చూస్తుంటే ఎవరో కొత్త హీరోను చూస్తున్న భావన కలుగుతుంది. లుక్.. బాడీ లాంగ్వేజ్.. యాక్టింగ్.. ఇలా అన్నింట్లోనూ కొత్దదనం చూపించాడు. పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉండాల్సిందనిపిస్తుంది. హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శిని.. నివేథ పేతురాజ్ ల వల్ల సినిమాకు ఒక తాజాదనం వచ్చింది. వాళ్లిద్దరూ అందంతో, నటనతో ఓకే అనిపించారు. ఐతే మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపించే వాళ్ల పాత్రలు తర్వాత తర్వాత సాధారణంగా మారిపోయాయి. పోసాని కృఫ్ణమురళి పాత్ర, ఆయన నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. థియేటర్ నుంచి బయటికొచ్చాక గుర్తుండే పాత్ర ఇది. సునీల్ చాన్నాళ్ల తర్వాత బాగా చేశాడు అనిపించాడు. అతడి పాత్ర బాగుంది. బ్రహ్మాజీ.. వెన్నెల కిషోర్ కూడా బాగా చేశారు. జయప్రకాష్ ఓకే.

సాంకేతికవర్గం:

దేవిశ్రీ ప్రసాద్ ‘ప్రేమ వెన్నెల’ పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఇలాంటి పాటలు ఇంకో రెండు పడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. గ్లాస్ మేట్స్ సాంగ్ పర్వాలేదు. మిగతా పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. దేవి బాగా చేయలేదని కాదు కానీ.. సంగీత పరంగా ఇంకా ఏదో ఉండాల్సిందనిపిస్తుంది. పాటలు తగ్గిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఒక ప్లెజెంట్ ఫీిలింగ్ కలిగిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ‘మైత్రీ మూవీ మేకర్స్’ స్థాయికి తగ్గట్లు.. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రచయిత.. దర్శకుడు కిషోర్ తిరుమల సంభాషణల దగ్గర ఎక్కువ మార్కులు వేయించుకుంటాడు. అతను ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కథనం కూడా ఎగుడుదిగుడుగా సాగుతుంది. తన గత సినిమాల్లో మాదిరి ఇందులో అతను ఎమోషణ్లు పండించలేకపోయాడు. సన్నివేశాల్ని ఆహ్లాదకరంగా నడిపించడంలో కిషోర్ ప్రత్యేకత కనిపిస్తుంది కానీ.. నరేషన్ మరీ స్లో అయిపోయింది. కిషోర్ మంచి ప్రయత్నమే చేశాడు కానీ.. ఆ ప్రయత్నంలో వంద శాతం ఎఫర్ట్ కనిపించలేదు.

చివరగా: చిత్రలహరి.. మంచి ప్రయత్నమే కానీ..!

రేటింగ్: 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News