దాస‌రి త‌ర్వాత మెగాస్టారే పెద్ద‌న్న‌.. ఇదే ప్రూఫ్‌!

Update: 2020-03-18 17:30 GMT
ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌రణానంత‌రం ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ర‌క‌మైన సందిగ్ధ వాతావ‌ర‌ణం అలుముకుంది. తేడా లొస్తే గ‌ట్టిగా చెమ‌డాలు ఒలిచే పెద్ద దిక్కు ఎవ‌రూ క‌నిపించ‌లేదు. దీంతో అల్ల‌ర్లు చెల‌రేగాయి. ఎవ‌రి ఇష్టానికి వాళ్లు టాలీవుడ్ ప‌రువు గంగ‌లో క‌లిపారు. మూవీ ఆర్టిస్టుల లొల్లు ద‌గ్గ‌ర నుంచి మీటూ హీట్ వ‌ర‌కూ ప్ర‌తిదీ ప‌రువు మ‌ర్యాద‌ల్ని మంట‌క‌లిపాయి. ఆ క్ర‌మంలోనే తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కును కోల్పోయింద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

దాస‌రి ఉంటే.. 24 శాఖ‌ల్లో ఎలాంటి స‌మ‌స్య త‌లెత్తినా ముందుండి స‌మ‌న్వ‌యం చేసి ప‌రిష్క‌రించేవారు. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చిన దాస‌రి గుమ్మం తొక్కితే అక్క‌డో ప‌రిష్కారం దొరికేది. ఇక ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత చోటు చేసుకున్న దారుణ ప‌రిణామాల గురించి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రు? అన్న దానిపై ర‌క‌ర‌కాల డిబేట్లు న‌డిచిన‌ప్ప‌టికీ ఆ స్థానానికి అర్హుడు మాత్రం ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్ర‌మేన‌ని చాలా మంది నిపుణులు భావించారు. దానికి త‌గ్గ‌ట్టు చిరంజీవి సైతం అంతే ఉత్సాహాన్ని చూపిస్తూ అన్నిటా నేనున్నాను అని నిరూపించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రోజు నేను పెద్ద అని ఎక్క‌డా చెప్ప‌కుండానే వెనుకుండి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. దాస‌రి మ‌ర‌ణం త‌ర్వాత చిన్న సినిమా ఫంక్ష‌న్ల‌కు అతిథిగా హాజ‌ర‌వ్వ‌డం...ఎవ‌రు పిలిచినా కాద‌న‌కుండా వెళ్ల‌డం ఆయ‌నకే చెల్లింది. వీలుంటే నేరుగా ఫంక్ష‌న్ కు వెళ్ల‌డం..కుద‌రని ప‌క్షంలో టీమ్ నే ఇంటికి పిలిపించి సింపుల్ గా కార్య‌క్ర‌మాన్ని ముగించ‌డం చేస్తున్నారు. ఇటీవ‌ల `మా` లో త‌లెత్తిన వివాదాన్ని ఆయ‌నే ద‌గ్గ‌రుండి ప‌రిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో ముందుగా త‌న 152వ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఆయ‌నే అన్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న త‌ర్వాతే మిగ‌తా హీరోల సినిమా షూటింగ్ లు వాయిదా వేసుకోవ‌డం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగానే ప‌రిశ్ర‌మ అంతా ఇలాంటి స‌మ‌యంలో స‌మిష్టిగా నిర్ణ‌యాలు తీసుకుని ముందుకు వెళ్లాల‌ని పిలుపు నిచ్చారు. ఆ వెంట‌నే ఛాంబ‌ర్ పెద్ద‌లు సైతం చిరు మాట‌ల్ని దృష్టిలో పెట్టుకుని వెంట‌నే సినిమా షూటింగ్ లు నిలిపివేస్తున్న‌ట్లు...థియేట‌ర్లను తాత్కాలికంగా మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇలా దాస‌రి మర‌ణం త‌ర్వాత చిరంజీవే పెద్ద‌గా చోర‌వ తీసుకుని అన్ని కార్య‌క్ర‌మాల్లో ముందుంటున్నారు. ఇటీవ‌ల తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చిరంజీవి..నాగార్జునల‌తో వ్య‌క్తిగ‌తంతో బేటి అయిన ప‌రిశ్ర‌మ అభివృద్ది గురించి చ‌ర్చించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరుపై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న అనుభ‌వం ముందు చివ‌రికి ప్ర‌శంస‌లుగా మారాల్సి వ‌చ్చింది. ఇక చిత్ర‌పురి ప‌క్క‌నే 10 ఎక‌రాల స్థ‌లాన్ని సినీప‌రిశ్ర‌మ‌కు కేటాయించాల్సిందిగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సానిని చిరు కోర‌డం గొప్ప పెద్ద‌రికం అన్న ప్ర‌శంస ద‌క్కింది. అటు ఏపీలోనూ ఓ ఇండ‌స్ట్రీ అభివృద్ధి కావాల‌ని అందుకు యువ సీఎం వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తాము అండ‌గా నిలుస్తామ‌ని ప‌రిశ్ర‌మ‌ను సిద్ధం చేస్తామ‌ని చిరు చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. దీంతో ఇంత‌క‌న్నా పెద్ద‌గా బాధ్య‌త‌లు తీసుకోవల్సింది ఏముంటుంద‌ని తాజాగా విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. దాస‌రి త‌ర్వాత ఆ స్థానం ఆయ‌నదేనంటూ ప్రేక్ష‌కాభిమానులు బ‌లంగా చెబుతున్నారు.


Tags:    

Similar News